జూబ్లీ హిల్స్ పరిసర బస్తీలలో నివసించే ప్రజలు ప్రభుత్వం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా కాలువ సమస్య, రోడ్లలేమి, ప్రాథమిక వసతుల కొరత కారణంగా తమ జీవితం నరకంగా మారిందని వారు వాపోయారు.
“మా కాలువ తొవ్వి వుంచేసి ఇలా నాశనం చేశారు. నీళ్ళు వెళ్లడానికి దారి లేదు. ఇళ్ళు కూల్చేశారు. పెద్దలు వస్తే ఒక్క గంటైనా మా దగ్గర కూర్చొని చూస్తారా?” అని ఒక మహిళ ప్రశ్నించారు.
ప్రభుత్వాలు మారుతున్నా, పరిస్థితులు మాత్రం మారలేదని అన్నారు. పథకాల పేరుతో ప్రచారం చేస్తూ, వాస్తవ జీవితంలో మాత్రం పేదల పట్ల నిర్లక్ష్యం కొనసాగుతోందని వారు పేర్కొన్నారు.
బస్సు రవాణా, పెన్షన్, పింఛన్ ఆలస్యం, ఆహార ధాన్యాల నాణ్యతపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. “సన్న బియ్యం ఇస్తున్నాం అంటున్నారు కానీ అందులో పురుగులు ఉన్నాయి. పెన్షన్ 23వ తేదీకి వస్తోంది, బీపీ మందులు కొనలేక ఇబ్బంది పడుతున్నాం” అని పెద్దలు వాపోయారు.
మహిళలు బస్సుల్లో ఎదుర్కొంటున్న సమస్యలపైనా మాట్లాడారు. “ఫ్రీ బస్సు అంటున్నారు, కానీ మగవాళ్లకు ఛార్జీలు పెంచేశారు. దీనితో ప్రయాణ చార్జీ డబుల్ అయింది” అని వారు పేర్కొన్నారు.
రాబోయే ఉపఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఆలోచనలో ఉన్నారు. గత నాయకులు చేసిన పనులు, ప్రస్తుతం అమలవుతున్న పథకాలను తులన చేస్తూ ఎవరు నిజంగా పని చేస్తారో వారు చూడాలని చెప్పారు.
“ఎవరైతే నిజంగా మా మధ్య కూర్చొని ఒక్కరోజైనా మా పరిస్థితి తెలుసుకుంటారో వాళ్ళకే మేము ఓటు వేస్తాం. మాటలతో కాదు, పనులతో చూపించాలి” అని ప్రజలు స్పష్టం చేశారు.
బస్తీ పౌరుల ఈ మాటలు స్పష్టంగా చెబుతున్నాయి – వారికి కావలసింది మాటలు కాదు, పనిచేసే నాయకులు.

