తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలంటూ.. సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి నడుద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవితకు ఆమోదం కూడా లభించినట్టు సమాచారం.
బంజారాహిల్స్‌లో నిర్వహించిన తెలంగాణ జాగృతి సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యచరణ, ప్రజా సమస్యల గుర్తింపు, పరిష్కార దిశగా కమిటీల ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామకాలపై గత 12 ఏళ్లలో ఎంతవరకు న్యాయం జరిగిందో అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీలను నియమించారు.
జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రూప్ సింగ్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయగా, సీనియర్ జర్నలిస్ట్ సయద్ ఇస్మాయిల్, లోక రవీంద్ర, జాగృతి సీనియర్ నాయకురాలు మంచాల వరలక్ష్మి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీలు నివేదికలను సమర్పించిన తర్వాత మరోసారి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి తుది నిర్ణయాలు తీసుకోవాలని కవిత భావిస్తున్నారు.
అయితే రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం పెద్ద విషయం కాదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అసలు ప్రశ్న.. ఈ పార్టీ ఎవరి కోసం? ఎవరి అవసరానికి? అనే దానిపైనే. పదేళ్ల క్రితం బీఆర్ఎస్ కూడా తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీగానే ప్రజలు నమ్మారు. కానీ పదేళ్ల పాలన అనంతరం అది కుటుంబ ప్రయోజనాలకే పరిమితమైందన్న భావన ప్రజల్లో బలంగా ఏర్పడింది.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు అధికారాన్ని అప్పగించారు. కానీ రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న జీవోలు, హిల్ట్ పాలసీ, ఫోర్త్ సిటీ, గ్లోబల్ సమ్మిట్ వంటి అంశాలు సామాన్యులకు అర్థం కాని రాజకీయ భాషగా మారాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరు గ్యారెంటీల అమలుపై స్పష్టత లేకుండానే ఒక సంవత్సరం గడిచిపోయిందన్న అసంతృప్తి ప్రజల్లో కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో కవిత కొత్త పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా అన్నదే అసలు చర్చ. తెలంగాణ ప్రజలు ఇప్పటికీ ఆమెను “కేసీఆర్ కుమార్తె”గానే చూస్తున్నారన్నది పెద్ద మైనస్‌గా మారింది. కల్వకుంట్ల కుటుంబ పాలనపై ఉన్న వ్యతిరేకత, గతంలో వచ్చిన స్కామ్ ఆరోపణలు కూడా ఆమె ఇమేజ్‌పై ప్రభావం చూపుతున్నాయి.
మరో కీలక అంశం నాయకత్వ లోపం. కవిత తప్పితే ఆమె పార్టీలో ఇప్పటివరకు ఒక్క మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ కూడా చేరలేదు. ప్రజాప్రతినిధులుగా పని చేసిన అనుభవజ్ఞులు లేకుండా పార్టీకి రాజకీయ బలం, శాంటిటీ రావడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు.
జనం బాట కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ, ఆ కార్యక్రమాల వల్ల ఏదైనా స్పష్టమైన సమస్య పరిష్కారం జరిగిందా? ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. కేవలం పర్యటనలు, స్పీచ్‌లు మాత్రమే సరిపోవని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇక “నీళ్లు–నిధులు–నియామకాలు” అనే నినాదానికి కూడా ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసిందన్న భావన ప్రజల్లో ఉంది. గత పదేళ్లలో ఈ అంశాలపై స్పష్టమైన ఫలితం కనిపించకపోవడంతో, అదే నినాదాన్ని మళ్లీ తీసుకొస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు.
అంతేకాదు, ప్రజల కోసం రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పే కవిత.. తన ఆస్తులు, వాటి మూలాలు, వ్యాపారాలపై పూర్తిస్థాయి పారదర్శకత చూపించాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించకపోతే నమ్మకం రావడం కష్టమేనన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
మొత్తంగా చూస్తే.. తెలంగాణ అస్తిత్వం పేరుతో కవిత పార్టీ ఏర్పాటు చేస్తున్నా, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజలు వెంటనే ఓన్ చేసుకునే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. బలమైన నాయకత్వం, స్పష్టమైన అజెండా, పారదర్శకత లేకపోతే ఈ పార్టీ కూడా గతంలో ఏర్పడిన అనేక ప్రాంతీయ పార్టీల మాదిరిగానే రాజకీయ చరిత్రలో మిగిలిపోయే ప్రమాదం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది.

