కాళ్లు మొక్కుత బాంచన్… ఒక్క యూరియా బస్త అయినా ఇప్పించండి సార్” అంటూ రైతులు వ్యవసాయ అధికారి కాళ్లు పట్టుకొని వేడుకున్న హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నరసింహులపేట మండలంలో జరిగిన ఈ ఘటన అక్కడున్న వారందరినీ కలచివేసింది.
మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని రైతు వేదిక వద్ద ఆదివారం యూరియా కొరత తీవ్రంగా కనిపించింది. పంటను కాపాడుకునేందుకు వచ్చిన రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం, ఆవేదన వ్యక్తమైంది. ఈ క్రమంలో నరసింహులపేట మండలం బస్తారం తాండకు చెందిన రైతులు రాజు, సూర్యలు వ్యవసాయ అధికారిని వేడుకుంటూ ఆయన కాళ్లు పట్టుకున్నారు.
“మా పంట ఎండిపోతోంది సార్… మీ కాళ్లు మొక్కుతా బాంచన్… ఒక్క బస్తా అయినా యూరియా ఇప్పించండి” అంటూ వారు ప్రాదేయపడటం అక్కడున్న ప్రతి ఒక్కరి మనసును కదిలించింది. గంటల తరబడి క్యూ లైన్లలో నిలిచినా యూరియా దొరకకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరత నెలకొనగా, పత్తి రైతులు సహా పలువురు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటను కాపాడుకునేందుకు అధికారుల కాళ్లు పట్టుకునే స్థాయికి పరిస్థితులు దిగజారడం వ్యవసాయ రంగంలోని దుర్గతిని చాటుతోంది.
ఇదిలా ఉండగా, యూరియా కొరతపై రాజకీయ పార్టీల నుంచి గట్టి స్పందన కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదట్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు కొంతమేర స్పందించినా, ప్రస్తుతం రైతుల తరఫున బలంగా పోరాడే నాయకత్వం కనిపించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రైతుల కష్టాలను చూసిన నెటిజన్లు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కనీస అవసరమైన ఎరువుల కోసం రైతులు ఇలా వేడుకోవాల్సి రావడం దారుణమని అభిప్రాయపడుతున్నారు.
పంట కాలంలో యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, వెంటనే ప్రభుత్వం స్పందించి సరఫరా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

