హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన మహానేత ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్ భావోద్వేగ ప్రసంగంతో ఆకట్టుకున్నారు. వేదికపై ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు నమస్కారాలు తెలియజేసిన ఆయన, తాను ఎమ్మెల్యేగా ఈ స్థాయికి రావడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ మద్దతు, ప్రజల ఆశీర్వాదాలే కారణమని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన నవీన్ యాదవ్, బక్రీద్ సందర్భంగా ముస్లిం మైనారిటీలకు కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గత జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సమయంలో ప్రజలు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరగా, రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆరు నెలల్లోనే విగ్రహావిష్కరణ జరగడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు హాజరుకావడం సీఎం రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానానికి నిదర్శనమని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలతో పాటు కోట్లాది రూపాయల అభివృద్ధి నిధులు మంజూరు అవుతున్నాయని, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
ఎన్టీఆర్ రాజకీయాల్లో బీసీలకు పెద్దపీట వేశారని గుర్తుచేసిన నవీన్ యాదవ్, ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలనలో కూడా బీసీలకు అధిక ప్రాధాన్యం లభిస్తోందన్నారు. తనలాంటి బీసీ యువకులకు రాజకీయ అవకాశాలు కల్పిస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి అని ప్రశంసించారు. భవిష్యత్తులో మరెందరో యువ నాయకులకు రాజకీయ భవిష్యత్తు కల్పించే నాయకత్వం ఆయనదేనని అన్నారు.
చివరగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు

