అమీన్‌పూర్ ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రిపోర్ట్ చేసిన జర్నలిస్టుపై దాడి – పట్టణచేరులో కలకలం

పటాన్‌చేరు / అమీన్‌పూర్:
తెలంగాణలో మీడియా స్వేచ్ఛపై మరోసారి నీడ పడేలా ఘటన చోటుచేసుకుంది. అమీన్‌పూర్ ప్రాంతంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ధైర్యంగా రిపోర్ట్ చేసిన సీనియర్ జర్నలిస్టు విత్తల్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు.

తహసీల్దార్ నేతృత్వంలో జరిగిన అధికార పరిశీలనలో 30 గుంటల ప్రభుత్వ భూమిని (నర్సరీ, పార్క్ కోసం కేటాయించిన భూమి) ఆక్రమించినట్లు రిపోర్ట్ రావడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

శుక్రవారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో సుమారు 15మంది ముసుగులు ధరించిన వ్యక్తులు జర్నలిస్టు ఇంట్లోకి చొరబడి, ఆస్తి ధ్వంసం చేసి, విత్తల్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఆయనకు తలకు, చేతికి గాయాలు అయ్యాయి. దాడి సమయంలో ఆయన భార్య, 3 ఏళ్ల చిన్న కుమార్తెను కూడా బెదిరించినట్లు సమాచారం.

పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే దుండగులు అప్పటికే పరారయ్యారు. బాధితుడు విత్తల్ తెలిపిన ప్రకారం, ఈ దాడి వెనుక మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగ రెడ్డి, అలాగే బీఆర్‌ఎస్ నేత గూడెం మహిపాల్ రెడ్డి అనుచరుల చేతకింద పని ఉన్నట్లు ఆరోపించారు.

విత్తల్ ఇటీవల అమీన్‌పూర్ ల్యాండ్ ఎన్‌క్రోచ్‌మెంట్ కేసుపై అనేక రిపోర్టులు చేశారు. ఆ రిపోర్టుల్లో నకిలీ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల దుర్వినియోగం, కోట్ల రూపాయల విలువైన అక్రమ నిర్మాణాల వివరాలు బయటపడ్డాయి.

స్థానిక ప్రజలు, జర్నలిస్టులు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజల మాటల్లో – “ఇక్కడ ల్యాండ్ మాఫియా రాజకీయ రక్షణలో బహిరంగంగా వ్యవహరిస్తోంది. వాళ్లను ప్రశ్నిస్తే బెదిరింపులు లేదా దాడులు జరుగుతున్నాయి” అన్నారు.

ఈ ఘటనపై మీడియా వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఓకే టీవీ రిపోర్టర్ శ్రావ్య ఘటనాస్థలాన్ని సందర్శించి,

“ఇది ఒక్క విత్తల్‌పై దాడి కాదు, ఇది జర్నలిజం మీద దాడి. నిజం చెప్పేవారిని భయపెట్టే ప్రయత్నం జరుగుతోంది”
అని తీవ్రంగా స్పందించారు.

ఆమె నేరుగా కేటీఆర్, హరీశ్ రావులతో పాటు బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని ఉద్దేశించి,

“ఇలాంటి గూండాయిజం తెలంగాణ ప్రతిష్ఠను చెడగొడుతోంది. పార్టీ నాయకులు బాధ్యత వహించాలి”
అని డిమాండ్ చేశారు.

అమీన్‌పూర్, పటాన్‌చేరు ప్రాంతాల్లో 14 ఏళ్లుగా రోడ్లు దెబ్బతిన్నా అభివృద్ధి కనిపించకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదే సమయంలో ప్రభుత్వ భూములు, పార్కులు, నర్సరీల భూములను ఆక్రమించడం మామూలైపోయింది.

ఈ సంఘటన మరోసారి ఒక నిజాన్ని స్పష్టం చేసింది – పటాన్‌చేరులో అధికార, అవినీతి, భయం త్రివేణి సంగమంలా మారింది.
అయినా శ్రావ్య మాటల్లో –

“నిజం కోసం గొంతు ఎత్తితే వారు దాడి చేయొచ్చు, కానీ తెలంగాణ ప్రజల గొంతు మాత్రం ఎప్పటికీ మూయలేరు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *