పీఎం కిసాన్ పథకంలో అవకతవకలు బహిర్గతం – భార్యాభర్తలకు రెండుసార్లు నిధులు, కేంద్రం 31 లక్షల కేసులు గుర్తింపు

దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన (PM Kisan Samriddhi Yojana) ప్రారంభించినా, ఇప్పుడు ఆ పథకం పక్కదారి పట్టినట్లు కేంద్ర తనికీల్లో తేలింది.

కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ నిర్వహించిన తనికీల్లో 31 లక్షల అనుమానాస్పద కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో 17.87 లక్షల భార్యాభర్తలిద్దరూ ఒకే ఇంటికి చెందినవారే అయినా, ఇద్దరికీ విడిగా పీఎం కిసాన్ నిధులు జమయ్యాయని తేలింది.

కుటుంబంలో భార్య గాని భర్త గాని ఒక్కరికే ఈ సాయం ఇవ్వాలి అనే మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, పలు రాష్ట్రాల్లో అధికారుల నిర్లక్ష్యం, స్థానిక స్థాయి అవినీతి కారణంగా ఒకే కుటుంబానికి డబుల్ లబ్ధి చేరినట్టు తేలింది.

అంతేకాకుండా, 1.76 లక్షల మైనర్ పిల్లలు మరియు కుటుంబ సభ్యుల పేర్లతో కూడా లబ్ధి తీసుకున్నట్లు కేంద్రం గుర్తించింది. 2019 తర్వాత నమోదు చేసుకున్న రైతులలో కొందరు తప్పుడు భూమి వివరాలు ఇచ్చి, పూర్వ యజమానుల పేర్లను ఖాళీగా వదిలేశారని వెల్లడైంది.

అలాగే 8.11 లక్షల మంది పూర్వపు భూమి యజమానులు, ప్రస్తుత యజమానులు ఇద్దరూ కలిసి ఈ పథకం ద్వారా డబ్బు పొందుతున్నారని కూడా బయటపడింది.

ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసి — అక్టోబర్ 15లోగా ఈ కేసులపై పూర్తి స్థాయి తనికీలు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పీఎం కిసాన్ నిధులను అసలైన లబ్ధిదారులకు మాత్రమే చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది.

కేంద్రం ఇప్పటికే రైతు గుర్తింపు కార్డు తప్పనిసరి చేస్తూ కొత్త లబ్ధిదారుల ఎంపికను మరింత కట్టుదిట్టం చేసింది. అయినప్పటికీ, స్థానిక స్థాయి అవినీతి, తప్పుడు రికార్డులు, రాజకీయ జోక్యాలు ఈ పథకాన్ని దెబ్బతీస్తున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *