హైదరాబాద్ నగరంలో “సేవ్ కేబీఆర్” ఉద్యమం రోజురోజుకు మరింత ఉధృతమవుతోంది. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం చెట్లను నరుకుతున్నారనే ఆరోపణలతో యువత, పర్యావరణ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో నిరసన తెలిపిన వారిపై కేసులు నమోదు చేయడం, అర్ధరాత్రి అరెస్టులు జరగడం మరింత చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల కోర్టు 25 నుంచి 35 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, వృక్షాలను నాశనం చేయరాదని స్టే ఆర్డర్ ఇవ్వడంతో ఉద్యమకారులు దీన్ని తాత్కాలిక విజయంగా భావిస్తున్నారు. ఈ అంశంపై నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఉద్యమకారులు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
పర్యావరణ కార్యకర్త రుచిత్ మాట్లాడుతూ… “హైదరాబాద్ పరిస్థితి కూడా ఢిల్లీ తరహాలో మారే ప్రమాదం ఉంది. ఢిల్లీలో గాలి కాలుష్యం ఎంత ప్రమాదకర స్థాయికి చేరుకుందో అందరికీ తెలుసు. అక్కడ ఒక్కరోజు ఊపిరి పీలిస్తే 7 నుంచి 10 సిగరెట్లు తాగినట్టే అంటారు. హైదరాబాద్ కూడా దాదాపు అదే దిశగా వెళ్తోంది. వింటర్ సీజన్‌లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది” అని హెచ్చరించారు.
“ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేయాల్సింది గ్రీన్ కవర్ పెంచడం, కాలుష్యాన్ని నియంత్రించడం. కానీ ఉన్న చెట్లనే నరుకుతూ ఫ్లైఓవర్లు కడతామంటే ఎలా? పర్యావరణ చట్టాలను పక్కన పెట్టి డెవలప్మెంట్ పేరుతో ముందుకు వెళ్తే మేము ప్రశ్నించక తప్పదు” అని అన్నారు.
నిరసన తెలిపిన యువతపై కేసులు పెట్టడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. “ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్పా? రాత్రి సమయంలో నిరసన తెలిపిన వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కేసులు పెట్టడం దారుణం. ప్రభుత్వం మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కానీ భయపెట్టే ప్రయత్నం చేయకూడదు” అని పేర్కొన్నారు.
ఫ్లైఓవర్లు ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని కూడా కార్యకర్తలు అంటున్నారు. “ఫ్లైఓవర్లు కడితే ట్రాఫిక్ ఒక జంక్షన్ నుంచి మరో జంక్షన్‌కు మారుతుంది తప్ప పూర్తిగా తగ్గదు. అదే డబ్బుతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను బలోపేతం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. బస్సుల సంఖ్య పెంచాలి, మెట్రో విస్తరణ చేయాలి” అని సూచించారు.
ప్రభుత్వం చెబుతున్న “డెవలప్మెంట్” నిర్వచనాన్ని కూడా వారు ప్రశ్నించారు. “డెవలప్మెంట్ అంటే కేవలం ఫ్లైఓవర్లు కాదు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. విద్య, వైద్యం, ప్రజా రవాణా మెరుగుపడాలి. పర్యావరణాన్ని నాశనం చేస్తూ చేసే అభివృద్ధి ప్రజలకు మేలు చేయదు” అని అభిప్రాయపడ్డారు
మరో కార్యకర్త మాట్లాడుతూ… “మేము డెవలప్మెంట్‌కు వ్యతిరేకం కాదు. కానీ ప్రభుత్వం ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (EIA) నివేదికను ప్రజల ముందుంచి వివరించాలి. చట్టాలకు లోబడి పనిచేయాలి. మేము కేవలం సమాధానాలు అడుగుతున్నాం” అన్నారు.
ప్రస్తుతం “సేవ్ కేబీఆర్” ఉద్యమం సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున మద్దతు పొందుతోంది. పర్యావరణ పరిరక్షణ, నగర భవిష్యత్తు, ప్రజా ఆరోగ్యం అంశాలపై చర్చ మళ్లీ కేంద్రంగా మారింది. కోర్టు స్టే తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

