తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై రాజకీయాలు ఉధృతమయ్యాయి. హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్లడంపై పట్టుదలగా ఉంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది ఎన్నికల ముందరి “పోలిటికల్ స్ట్రాటజీ” అని ఆరోపిస్తున్నాయి.
ఓకే టీవీతో మాట్లాడిన ఆమాద్మీ పార్టీ నాయకురాలు హేమ జిల్లోజి గారు వ్యాఖ్యానిస్తూ, “రేవంత్ రెడ్డి గారు ఈ రిజర్వేషన్ అంశాన్ని ప్రజల దృష్టిని మరల్చేందుకు మాత్రమే వాడుకుంటున్నారు. రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థ ఎన్నికలను నిలిపి పెట్టి ఇప్పుడు హఠాత్తుగా రిజర్వేషన్ల మాట ఎందుకు తెచ్చారు?” అని ప్రశ్నించారు.
ఆమె అభిప్రాయంలో, ప్రభుత్వం చేతుల్లో ఉన్న అధికారంతో ముందే బీసీ వర్గాలకు అవకాశాలు ఇవ్వవచ్చని, కానీ అది చేయకపోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని చూపిస్తున్నదని అన్నారు. “ప్రతి ముఖ్యమైన పదవీ రెడ్డి వర్గానికే కేటాయించారు. ఇప్పుడొస్తే ఎన్నికల ముందు బీసీలకు మద్దతు అని చెబుతున్నారు, ఇది పూర్తిగా ఎన్నికల స్టంట్ మాత్రమే,” అని ఆమె వ్యాఖ్యానించారు.
ఇక బీజేపీ వైపు నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బండి సంజయ్ మరియు రామచంద్రరావు లాంటి నాయకులు మాట్లాడుతూ, “42% రిజర్వేషన్‌లో ముస్లిం ఓటర్ల భాగం ఉన్నందున మేము దాన్ని అంగీకరించం. ఇది నైన్ షెడ్యూల్‌లో పెట్టే అంశం కాదు,” అని అన్నారు.
హేమ జిల్లోజి గారు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, “బీజేపీ కూడా ఈ అంశాన్ని కేవలం రాజకీయ అజెండాగా వాడుకుంటోంది. బీసీలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ విఫలమయ్యాయి. జనగణన పూర్తి చేయకపోతే రిజర్వేషన్ ఎలా ఇస్తారు?” అని ప్రశ్నించారు.
ప్రస్తుతం హైకోర్టులో తుది తీర్పు వెలువడబోతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ కొనసాగుతుండడంతో నామినేషన్ల సమర్పణకు సమయం దగ్గర పడుతోంది. తీర్పు బీసీల భవిష్యత్తును, అలాగే స్థానిక సంస్థ ఎన్నికల రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేయనుంది.

