తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి రైతులకు భారీ శుభవార్త ప్రకటించింది. ఈ వర్షాకాలంలో సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండించిన రైతులకు ప్రతి గింజ కొనుగోలు చేస్తామని రాష్ట్ర కేబినెట్ స్పష్టం చేసింది. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటుందని అధికారులు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ గోదాములు ఇప్పటికే నిండిపోయాయని, కేవలం 50 లక్షల టన్నులు మాత్రమే తీసుకోగలమనే సంకేతం ఇచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కనీసం మరిన్ని 15–20 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని అభ్యర్థించింది.
కేబినెట్ సమావేశంలో తీసుకున్న మరో ముఖ్య నిర్ణయం ప్రకారం, మద్దతు ధరతో పాటు ప్రతి క్వింటల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇది రాష్ట్రంలోని లక్షలాది వరి రైతులకు గణనీయమైన ఉపశమనం కలిగించనుంది.
అదేవిధంగా, హుజూర్నగర్, కొడంగల్, నిజామాబాద్‌లలో మూడు కొత్త అగ్రికల్చర్ కాలేజీల స్థాపనకు ఆమోదం లభించింది. ఆధునాతన సౌకర్యాలతో ఈ కళాశాలలు వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలకు దారితీయనున్నాయి.
ఇక ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జరగబోయే ఉత్సవాల కోసం ఒక కేబినెట్ సబ్‌కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
అంతేకాక, స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనల్లో ఉన్న “ఇద్దరు పిల్లల పరిమితి నియమాన్ని” ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో మరిన్ని అభ్యర్థులు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం పొందనున్నారు.

