తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, డివిజన్ల పునర్విభజన ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. ఇన్నాళ్లుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఈ ప్రక్రియ కోసం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.
15 నుంచి 20 జిల్లాల వరకు అవకాశం
ప్రస్తుతం ఉన్న జిల్లాల సంఖ్యను కనిష్టంగా 15 నుంచి గరిష్టంగా 20 జిల్లాల వరకు కుదించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్‌కు ఒక జిల్లా అన్న ప్రాతిపదికపై పునర్విభజన జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అంశం ఒక్కసారి అధికారికంగా వార్తల్లోకి వస్తే, ప్రధాన చర్చాంశంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.
రాజకీయ ఇబ్బందులు రాకుండా కమిషన్
జిల్లాలు–మండలాల పునర్విభజన రాజకీయంగా సున్నితమైన అంశం కావడంతో, ఎలాంటి విమర్శలు రాకుండా జుడిషియల్ కమిషన్ ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కమిషన్ ఆరు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ప్రజల నుంచి అభిప్రాయాలు, వినతులు స్వీకరించి అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.
అసెంబ్లీలో మార్గదర్శకాలపై చర్చ
జిల్లాలు, మండలాల పునర్విభజనకు సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలను వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ఖరారు చేస్తామని సీఎం తెలిపారు.
గత విభజనపై అసంతృప్తి
గతంలో జరిగిన జిల్లాలు–మండలాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని ఉద్యోగులు, అధికారులు, తెలంగాణ వాదులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సీఎం గుర్తు చేశారు.
ఒకే అసెంబ్లీ నియోజకవర్గం రెండు లేదా మూడు జిల్లాల్లో ఉండటం, ఆర్డీఓ స్థాయి రెవెన్యూ డివిజన్లను జిల్లాలుగా మార్చడం వంటి అంశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయని తెలిపారు.
మొదట మండలాల రేషనలైజేషన్
పునర్విభజనలో భాగంగా ముందుగా మండలాల రేషనలైజేషన్ అవసరమని సీఎం చెప్పారు. ప్రస్తుతం మండలాల జనాభాలో తీవ్ర అసమానతలు ఉన్నాయని, ఇకపై గరిష్టంగా 10 శాతం అటు ఇటు తేడా మాత్రమే ఉండేలా చూడనున్నట్లు తెలిపారు.
నగరాల్లో పోలీస్ కమిషనరేట్లను సర్దుబాటు చేశామని, కొత్త పేర్లు పెట్టలేదని, రాచకొండ దొరల పేరు పెట్టిన దానినే మార్చామని స్పష్టం చేశారు.
కేసీఆర్‌పై విమర్శలు
ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
“నచ్చితే నజరానా, అదే విధంగా జిల్లాలు–మండలాలు చేసేశారు” అంటూ గత ప్రభుత్వం అశాస్త్రీయంగా విభజన చేసిందని అన్నారు.
ఇటీవల కొందరు తమ మండలాలు, నియోజకవర్గాలను ఇటు అటు మార్చాలని విజ్ఞప్తులు చేయడమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి వివరణ
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్టులు, సింగరేణి, విద్యుత్ సంస్థలకు కలిపి లక్ష కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో పెట్టారని సీఎం ఆరోపించారు.
ప్రభుత్వానికి నెలకు సుమారు 30 వేల కోట్లు ఖర్చు అవసరం కాగా, ఆదాయం మాత్రం 18,500 కోట్లు మాత్రమే వస్తోందని తెలిపారు.
కొన్ని ఖర్చులు వాయిదా వేసినా నెలకు కనీసం 22,500 కోట్లు ఖర్చు అవుతోందని వివరించారు.
ఉద్యోగులపై వ్యాఖ్య
ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదని, అందరం కలిసే ప్రభుత్వం అని సీఎం స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సు పెంచడంతో, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అవుతున్నారని, దీని వల్ల ఆర్థిక భారం పెరిగిందని అన్నారు.

