తెలంగాణ సెక్రటేరియట్లో ప్రజల సమస్యలు వినేందుకు ఏర్పాటు చేసిన విజిటర్ అవర్స్ ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాధారణ ప్రజలు ఎంట్రీ పాస్ తీసుకొని అధికారులను కలిసేలా ప్రత్యేక సమయం కేటాయించింది. కానీ ఆ సమయంలోనే మెజారిటీ ఐఏఎస్ అధికారులు తమ ఛాంబర్లలో లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట.
దూర ప్రాంతాల నుంచి తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలు గంటల తరబడి ఎదురు చూసినా అధికారులు కనిపించకపోవడంతో ఆవేదన చెందుతున్నారట. “సార్ ఎక్కడికి వెళ్లారు? ఎప్పుడు వస్తారు?” అని పేషీ సిబ్బందిని అడిగితే “మాకు తెలియదు.. ఎప్పుడు వస్తారో కూడా చెప్పలేం” అనే సమాధానాలే వస్తున్నాయని సందర్శకులు వాపోతున్నారు.
ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారం, క్షేత్రస్థాయి ఇబ్బందులపై సమాచారం సేకరించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు ప్రజలతో మమేకం కావడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ఉన్న లోపాలు, గ్రౌండ్ లెవెల్లో ఏర్పడుతున్న ఇబ్బందులు నాయకత్వానికి చేరవేయాల్సింది అధికారులేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే ప్రజలకు అధికారులు అందుబాటులో లేరనే భావన పెరుగుతోందట. కొందరు ఐఏఎస్ అధికారులు మధ్యాహ్నం తర్వాతే కార్యాలయాలకు వస్తున్నారని, కొందరు తమ శాఖ మంత్రులు సెక్రటేరియట్‌కు వస్తున్నారా లేదా అన్న సమాచారం తెలుసుకున్న తర్వాతే ఆఫీసుకు వస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ప్రభుత్వం ఉద్యోగులకు వారంలో రెండు రోజుల సెలవులపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో మరింత అసంతృప్తి వ్యక్తమవుతోంది. “రోజుకు ఒక గంట కూడా ప్రజల కోసం పని చేయని పరిస్థితి ఉంటే ఇంక రెండు రోజుల సెలవులు ఎందుకు?” అంటూ కొందరు మండిపడుతున్నారట.
ఇక ప్రజా ప్రతినిధుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతుల దగ్గరకు వెళ్తే ధాన్యం కొనుగోళ్లు, మహిళల దగ్గరకు వెళ్తే హామీలు, నిరుద్యోగుల దగ్గరకు వెళ్తే ఉద్యోగాల అంశాలు ఎదురవుతున్నాయని, అందుకే ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా నాయకులు వెనుకడుగు వేస్తున్నారనే చర్చ సాగుతోంది.
ప్రభుత్వ పథకాలపై వచ్చిన సమస్యలు, ప్రజల అసంతృప్తి, క్షేత్రస్థాయి ఫిర్యాదులు ముఖ్యమంత్రి మరియు మంత్రులకు చేరవేయాల్సిన బాధ్యత ఉన్న అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే పాలనపై ప్రజల నమ్మకం దెబ్బతింటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ముఖ్యంగా “ముఖ్యమంత్రి మాట కూడా కొందరు అధికారులు పట్టించుకోవడం లేదట” అనే ఆరోపణలు ప్రభుత్వ వ్యవస్థపై మరింత చర్చకు దారితీస్తున్నాయి. ప్రజలు మాత్రం ఒకే మాట చెబుతున్నారు — అధికారులు అందుబాటులో ఉండాలి, సమస్యలు వినాలి, ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందనే నమ్మకం కల్పించాలి అని.

