తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నియామకాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మిని నియమించగా, సభ్యులుగా తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతతో పాటు మరికొందరిని ఎంపిక చేసింది. అయితే ఈ నియామకాలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉద్యమ కుటుంబాలకు ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విమర్శకులు చెబుతున్నదేమిటంటే.. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన కుటుంబాలకు కేవలం సభ్యుల స్థాయిలో పోస్టులు ఇవ్వడం సరైన గౌరవం కాదని అంటున్నారు. శ్రీకాంతాచారి తల్లి లేదా చాకలి ఐలమ్మ కుటుంబానికి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్థాయి వంటి కీలక హోదా ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఉద్యమ సమయంలో త్యాగాలు చేసిన కుటుంబాలను కేవలం ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గద్వాల్ విజయలక్ష్మి నియామకంపైనా రాజకీయ చర్చ నడుస్తోంది. జీహెచ్‌ఎంసీ మేయర్‌గా పనిచేసిన సమయంలో ఆమె సాధించిన ప్రగతి ఏమిటి? మహిళల సమస్యలపై ఆమె చేసిన పోరాటం ఏమిటి? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మహిళా హక్కులు, భద్రత, సంక్షేమ అంశాలపై దీర్ఘకాలంగా పనిచేసిన మహిళా నేతలను పక్కన పెట్టి, రాజకీయ సమీకరణాల ఆధారంగా ఈ నియామకాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ అంతర్గత వర్గాల నుంచే అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలుస్తోంది.
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవిని ఆశించిన పలువురు కాంగ్రెస్ మహిళా నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పార్టీ కోసం సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను పక్కన పెట్టి, ఇటీవలి కాలంలో పార్టీలో చేరిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం సరైంది కాదని వారు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా మహిళా కమిషన్ వంటి కీలక సంస్థకు ఉద్యమ నేపథ్యం, మహిళా హక్కుల కోసం పోరాటం, సామాజిక అనుభవం ఉన్నవారిని ఎంపిక చేయాల్సిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇక మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన శశిక యాదవ్ రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తాను కార్పొరేషన్ చైర్‌పర్సన్ స్థాయి పదవిని ఆశిస్తే, సభ్యురాలి పోస్టు ఇవ్వడం సరికాదని ఆమె వ్యాఖ్యానించినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ నియామకాల వెనుక రాజకీయ సమీకరణాలు, అంతర్గత అసంతృప్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. తెలంగాణ ఉద్యమం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం వంటి అంశాల పేరుతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు నిజంగా ఆ భావజాలాన్ని ప్రతిబింబించాలే తప్ప, కేవలం రాజకీయ సమతుల్యత కోసం తీసుకున్నట్టుగా కనిపించకూడదని అంటున్నారు. ఉద్యమ కుటుంబాలకు నిజమైన గౌరవం ఇవ్వాలంటే వారికి ప్రతిష్టాత్మకమైన, నిర్ణయాధికారంతో కూడిన పదవులు ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఈ నియామకాల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం మహిళా సంఘాలు, ఉద్యమకారులు, రాజకీయ వర్గాల్లో ఇంకా చర్చకు దారితీస్తోంది.

