తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు అదే నిరుద్యోగులపై అప్లికేషన్ ఫీజుల రూపంలో అదనపు భారం మోపిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తాజాగా విడుదల చేసిన ఐదు ఉద్యోగ నోటిఫికేషన్లలో దరఖాస్తు రుసుములను భారీగా పెంచడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల నుంచి కేవలం రూ.200 మాత్రమే అప్లికేషన్ ఫీజుగా వసూలు చేసేవారు. అయితే తాజా నోటిఫికేషన్లలో ఓసీ, బీసీ అభ్యర్థులకు ఈ ఫీజును ఏకంగా రూ.1,000కు పెంచారు. అంటే ఒకేసారి 400 శాతం పెంపు చేసినట్టైంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు కూడా రూ.500 ఫీజు నిర్ణయించడం నిరుద్యోగుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది.
ఇప్పటికే కోచింగ్ ఫీజులు, గది అద్దెలు, ఆహార ఖర్చులు, ప్రయాణ వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఈ ఫీజుల పెంపు మరింత భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని అశోక్ నగర్, దిల్సుఖ్నగర్, చిక్కడపల్లి వంటి ప్రాంతాల్లో సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక అభ్యర్థి నాలుగు లేదా ఐదు ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే దాదాపు రూ.1,000 ఖర్చయ్యేది. ఇప్పుడు అదే ప్రక్రియకు రూ.5,000 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అప్లికేషన్ ఫీజులను తక్కువగా ఉంచారని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఒకే విద్యార్హతతో భర్తీ చేసే పోస్టులను కంబైన్డ్ నోటిఫికేషన్ల రూపంలో విడుదల చేయడం వల్ల అభ్యర్థులపై ఆర్థిక భారం తగ్గేదని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతి పోస్టుకు విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేయడం వల్ల ఫీజుల భారం మరింత పెరిగిందని ఆరోపిస్తున్నారు.
ఈ ఫీజుల పెంపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన “అభయ హస్తం” మేనిఫెస్టోలో పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయబోమని, దరఖాస్తులను పూర్తిగా ఉచితం చేస్తామని హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకపోగా, ఉన్న ఫీజులను నాలుగు రెట్లు పెంచడంపై నిరుద్యోగ సంఘాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

