దేశంలో సత్యానికి–అసత్యానికి మధ్య పోరాటం నడుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గంలోనే పోరాడి నరేంద్ర మోదీ–ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ డీఎన్‌ఏలోనే ఓట్ చోరీ ఉందని, కాంగ్రెస్ డీఎన్‌ఏలో మాత్రం సత్యం, అహింస ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు.
ఆదివారం న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఓట్ చోరీ – గద్దీ చోడ్” మెగా ర్యాలీలో రాహుల్ గాంధీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేశ్ తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగానే బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.
ఓట్ చోరీలో దొరికిపోయామని మోదీ, అమిత్ షాలకు అర్థమైందని, పార్లమెంట్‌లో ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు అమిత్ షా చేతులు వణికాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సత్యం గెలవడానికి కొంత సమయం పట్టవచ్చునని, కానీ తుది విజయం మాత్రం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని రద్దు చేసేవారని, ఈ విషయాన్ని ఎన్నికలకు ముందే తాను చెప్పానని, అందుకే ప్రజలు బీజేపీకి 240 సీట్లకే పరిమితం చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
అయితే ఓట్ చోరీ ఆరోపణలపై రాజకీయంగా విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఓట్ చోరీ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, అదే సమయంలో తెలంగాణలో జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్షాలు, మీడియా పలు ఆధారాలు చూపించినప్పటికీ, ఈసీ స్పందన లేదనే విమర్శలు వచ్చాయి.
ఇక పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల పేరుతో వేలంపాటలు జరిగాయని, భారీగా డబ్బులు లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. ఇది కూడా ఓట్ చోరీ కిందే పరిగణించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈసీ అన్ని పార్టీలకు సమానంగా వ్యవహరించాలన్న ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి.

