సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలకు పూర్తిగా చెక్ పెట్టాలంటే బ్యాంకులు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ బీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రస్తుత బ్యాంకింగ్ నిబంధనల్లో సమూల మార్పులు అవసరమని, ముఖ్యంగా మ్యూల్ ఖాతాల నియంత్రణపై ఆర్బీఐ కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రతో సీపీ సజ్జనార్ నేతృత్వంలోని హైదరాబాద్ పోలీసుల ఉన్నతాధికారుల బృందం ప్రత్యేకంగా భేటీ అయింది. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే స్థాయిలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు.
సైబర్ నేరగాళ్లు అమాయక విద్యార్థులు, కూలీలు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని రెండు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు కమిషన్ ఆశ చూపి వారి పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారని తెలిపారు. బాధితుల నుంచి దోచుకున్న సొమ్మును క్షణాల్లోనే ఈ మ్యూల్ ఖాతాల ద్వారా మళ్లిస్తున్నారని వివరించారు.
ఈ సమస్యను అరికట్టేందుకు మ్యూల్ ఖాతాల గుర్తింపునకు ప్రత్యేకమైన సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఏర్పాటు చేయాలని సజ్జనార్ సూచించారు. ఖాతా తెరిచే సమయంలో నిబంధనలను మరింత కఠినతరం చేయాలని, జియో వెరిఫికేషన్‌తో పాటు లైవ్ వీడియో కేవైసీ తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. ఖాతాదారుడు భౌతికంగా ఉన్నాడా లేదా అనే అంశాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు.
సైబర్ నేరం జరిగిన వెంటనే బాధితుల సొమ్మును కాపాడేందుకు, నేరగాళ్లను పట్టుకునేందుకు బ్యాంకులు సత్వర స్పందన చూపాలని సూచించారు. ప్రస్తుతం ఒక్కో బ్యాంకు ఒక్కో ఫార్మాట్లో స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. డెబిట్, క్రెడిట్ వివరాలతో పాటు డబ్బు పంపినవారు, అందుకున్న వారి పూర్తి సమాచారం ఒకే ఫార్మాట్లో అందించాలని డిమాండ్ చేశారు.
ఇంటి నుంచే సంపాదన, పార్ట్ టైం జాబ్స్ పేరుతో నిరుద్యోగులు, గృహిణీలను మోసం చేస్తున్న సంస్థలపై ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకుని ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో హైదరాబాద్ అడిషనల్ సీపీ ఎం.శ్రీనివాసులు, సీసీఎస్ డీసీపీ శ్వేత, సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు తదితరులు పాల్గొన్నారు.

