సినిమా రంగంలో కంటెంట్ ఎంత ముఖ్యమో… సెంటిమెంట్స్ కూడా అంతే కీలకం అని చాలామంది దర్శకులు, నిర్మాతలు నమ్ముతారు. మంచి కథతో పాటు సినిమా రిలీజ్ అయ్యే ముహూర్తం కూడా కలిసిరావాలన్నదే వారి విశ్వాసం. అందుకే ఏ సీజన్‌లో ఏ హీరోకి, ఏ హీరోయిన్‌కు సక్సెస్ కలిసి వస్తుందో అన్న అంశాలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ అంటే బాక్సాఫీస్ వద్ద ప్రత్యేక హైప్ ఉంటుంది.
ఈ సంక్రాంతి కానుకగా నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ది రాజాసాబ్’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ వంటి భారీ సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ… రాజు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రెట్టించిన నమ్మకంతో బరిలోకి దిగుతున్నాడు.
‘జాతిరత్నాలు’ తర్వాత నవీన్ పోలిశెట్టికి సరైన హిట్ పడలేదు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో ప్రయత్నం చేసినా ఆశించిన ఫలితం రాలేదు. దీంతో దాదాపు రెండేళ్ల గ్యాప్ అనంతరం ‘అనగనగా ఒక రాజు’గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాపై నవీన్‌కు మాత్రమే కాదు… హీరోయిన్ మీనాక్షి చౌదరికి కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
ముఖ్యంగా మీనాక్షికి ఉన్న సంక్రాంతి సెంటిమెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత ఏడాది ఆమె నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ అయి ఏకంగా 300 కోట్ల వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతకు ముందు 2024 సంక్రాంతికి వచ్చిన ‘గుంటూరు కారం’లో సెకండ్ లీడ్‌లో నటించినా… ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇలా వరుసగా సంక్రాంతి రిలీజ్‌లు మీనాక్షికి కలిసొచ్చాయి.
ఈ నేపథ్యంలో మరోసారి సంక్రాంతి బరిలోకి దిగుతున్న మీనాక్షి… ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా హిట్ అయితే సంక్రాంతి రిలీజ్‌లకు మీనాక్షి ఒక బ్రాండ్‌గా మారే అవకాశముంది. అదే సమయంలో ఆమె కెరీర్‌కు కూడా ఇది చాలా కీలకమైన సినిమా.
‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి భారీ హిట్ వచ్చినా… ఆ సినిమా క్రెడిట్ ఎక్కువగా ఐశ్వర్యా రాజేష్ ఖాతాలోకే వెళ్లడంతో మీనాక్షికి పెద్దగా అవకాశాలు రాలేదు. టాలెంట్ ఉన్నా సరే… సరైన ఆఫర్లు లేక ఖాళీగా గడిపిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’ హిట్ అయితే కొత్త ఏడాదిలో మీనాక్షి మరింత బిజీ అయ్యే అవకాశం ఉంది.
మొత్తానికి… హీరోయిన్ సెంటిమెంట్ హీరోకి కూడా ప్లస్ అవుతుందా?
ఈ సంక్రాంతి మీనాక్షి లక్కీ చార్మ్‌గా మారుతుందా? లేక నవీన్ పోలిశెట్టికి మరోసారి ఎదురుదెబ్బ తగులుతుందా? అన్నది బాక్సాఫీస్ వద్దే తేలనుంది.

