ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుపై కాంగ్రెస్ విమర్శలు: “పోరాట యోధుడిలా నటిస్తున్నారు

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విచారణకు పిలిస్తే ఏదో పెద్ద పోరాట యోధుడిలా హరీష్ రావు ఫీల్ అవుతున్నారని, పదేళ్ల పాటు నీచంగా ఫోన్ ట్యాపింగ్ చేయించి ఇప్పుడు సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ధ్వజమెత్తారు.

ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ చేశాడని స్వయంగా కవిత గారే చెప్పారని ఆయన గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల ముందు డ్రామాలు చేస్తున్నారని హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఈ కేసు కొత్తది కాదని, గత రెండేళ్లుగా విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకుంటే నాలుక కోస్తామని హెచ్చరించారు.

విచారణ అనంతరం హరీష్ రావు తిక్కతిక్కగా మాట్లాడుతున్నారని, సిట్ దెబ్బకు ఆయన చిన్న మెదడు చితికినట్టుగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. సిట్ అధికారుల ప్రశ్నలకు నీళ్లు నమిలి బయటకు వచ్చాక బడాయి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని హరీష్ రావు చెప్పకనే చెబుతున్నారని వ్యాఖ్యానించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే తెలంగాణ జాతి పితలాగా హడావుడి చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ అన్నారు. ఆయనను విచారించవద్దని చట్టంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు భయమని కాంగ్రెస్ నేతలు నిలదీశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారణకు పిలిస్తే సంబరాలు చేసుకోవడం దారుణమని, తప్పు చేశామన్న భావన ఏమాత్రం కనిపించడం లేదన్నారు. ఇంట్లో గొడవలను పక్కదారి పట్టించేందుకు కేటీఆర్, హరీష్ రావు డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ మాట్లాడుతూ, విచారణ సందర్భంగా వాస్తవాలు చెప్పి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హరీష్ రావుకు సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కవిత చేసిన వ్యాఖ్యలు బలమైన ఆధారాలుగా మారాయని అన్నారు. సొంత కూతురే బయటకు వచ్చి ఈ విషయాలు చెప్పినప్పుడు ప్రజల్లో నమ్మకం కలగడం సహజమని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ కేసులో ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. సుమారు ఆరు వేల మందికి సంబంధించిన బయోడేటా అధికారుల వద్ద ఉండటం, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు, న్యాయమూర్తులు, రిటైర్డ్ జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం అనేది తీవ్ర ఆరోపణలకు దారితీస్తోందని తెలిపారు.

అధికారిక కార్యాలయాల్లో కాకుండా ప్రైవేట్ భవనాల్లో ట్యాపింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఇది ఉన్నతస్థాయి ఆదేశాలతోనే జరిగి ఉండొచ్చని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అవసరమైతే ఈ వ్యవహారంలో ఢిల్లీ స్థాయి నాయకుల ప్రమేయం కూడా బయటపడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *