ఎన్నికల సాకుతో రైతు భరోసాకు వాయిదా? సీఎం రేవంత్ రెడ్డి హామీలపై రైతుల్లో అనుమానాలు

మున్సిపల్ ఎన్నికల సాకుతో రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని మరోసారి వాయిదా వేయడంపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికలు పూర్తైన తర్వాత రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాల నేపథ్యంలో సీఎం మాటలు నమ్మదగినవేనా అనే చర్చ గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది.

ఇదివరకూ కూడా అనేకసార్లు రైతు భరోసా హామీలు ఇచ్చారని, కానీ వాటి అమలు మాత్రం ఎప్పుడూ ఖచ్చితంగా జరగలేదని రైతులు గుర్తు చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కో ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పారని, కానీ ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మే నెలలో ఎకరానికి కేవలం రూ.5,000 మాత్రమే జమ చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధం చేసిన నిధుల నుంచేనని విమర్శిస్తున్నారు.

ఒక సీజన్ పూర్తిగా వాయిదా వేసి, తరువాతి రెండు సీజన్లలో కోతలు పెట్టారని రైతులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఎన్నికల తర్వాతే రైతు భరోసా ఇస్తామని చెప్పడం వెనుక ఓట్ల కోసం వేసిన వ్యూహమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు ఎందుకు రైతు భరోసా వేయలేకపోతున్నారు? అనే ప్రశ్న రైతుల్లో వినిపిస్తోంది.

రైతు భరోసా గానీ, ఆరు గ్యారెంటీలు గానీ ఇకపై ఆశపడే పరిస్థితి లేదని చాలా మంది రైతులు అభిప్రాయపడుతున్నారు. హామీలతో ఓట్లు వేయించుకుని, తరువాత అమలు చేయకుండా తప్పించుకోవడమే ప్రభుత్వ ధోరణిగా మారిందని విమర్శలు చేస్తున్నారు. పెన్షన్లు పెంచుతామన్నా, సంక్షేమ పథకాలు ఇస్తామన్నా నమ్మొద్దని, ఆశపడితే మోసపోయే ప్రమాదమే ఎక్కువని రైతులు చర్చించుకుంటున్నారు.

భవిష్యత్ నగరం పేరుతో 2047 లక్ష్యంగా పెద్ద పెద్ద ప్రణాళికలు, అప్పులపై ఉపన్యాసాలు ఇస్తున్న ప్రభుత్వం, ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రాబోయే మూడేళ్లలో ప్రజల జీవన పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో ఆలోచించకుండా, భవిష్యత్ కలలతో కాలం గడుపుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిజంగా రైతు భరోసా ఇస్తే అది అదృష్టంగా భావించాల్సిందేనని, కానీ హామీలపై మాత్రం ఇక నమ్మకం లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *