రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. నెలల తరబడి జీతాలు అందక దాదాపు 1900 మంది ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ ఖర్చులకు డబ్బులు లేక అప్పుల పాలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్ పాఠశాలలు, మోడల్ స్కూల్లు, కస్తూర్బా విద్యాలయాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, ప్రభుత్వ కాలేజీల్లో ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగ స్థాయిని బట్టి నెలకు రూ.13,600 నుంచి రూ.20,000 వరకు వేతనాలు ఉన్నప్పటికీ, అవి కూడా సకాలంలో అందడం లేదని వారు చెబుతున్నారు.
యువశక్తి, లక్ష్య, లేబర్నెట్, ఎల్ అండ్ జే ఎంప్లాయర్ తదితర 18 ఏజెన్సీల ద్వారా వేతనాలు చెల్లించాల్సి ఉన్నా, ఒకటి రెండు ఏజెన్సీలు తప్ప మిగిలినవి ఆరు నుంచి ఏడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఏజెన్సీలు ప్రభుత్వంపై, ప్రభుత్వం ఏజెన్సీలపై నెపం మోపుకుంటూ సమస్యను పట్టించుకోవడం లేదని ఉద్యోగులు అంటున్నారు.
గతంలో కనీసం రెండు మూడు నెలలకోసారి అయినా జీతాలు వచ్చేవని, ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఇళ్ల అద్దెలు చెల్లించలేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి నెలా నిర్దిష్ట తేదీన జీతాలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందని మండిపడుతున్నారు.
వేల కోట్ల కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించే ప్రభుత్వం తమ వేతనాల విషయంలో నిర్లక్ష్యం చేయడం అన్యాయమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయి జీతాలు చెల్లించాలని, లేదంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు.
ఈ సమస్యపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

