మంత్రుల వివాదాలకు సీఎం రేవంత్ హెచ్చరిక – సమన్వయంతో పని చేయాలని సూచన

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మంత్రులపై సున్నితంగా కానీ కఠినంగా హెచ్చరిక జారీ చేశారు. ఇటీవల వివిధ మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని గుర్తించి, రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఫోన్లు చేసి వారిని ఆపద్ధర్మంగా క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.

ఇటీవల అడ్లూరి లక్ష్మణ్, కొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్, సీతక్క వంటి నేతల మధ్య వచ్చిన విమర్శలు, వ్యాఖ్యలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
“ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా నాతో మాట్లాడండి, కానీ మీడియా ఎదుట వివాదాలు సృష్టించొద్దు” అని రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించినట్లు టాక్ ఉంది.

సీఎం మాట్లాడుతూ, “ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కంటే చిన్న చిన్న వివాదాలకే మీడియా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. మీరు ప్రజలకు చేసే సేవే ముఖ్యం. పార్టీ ప్రతిష్ట కాపాడటమే ప్రధాన బాధ్యత” అని స్పష్టం చేశారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో సమన్వయం లేకుండా పనిచేయడం వల్ల ప్రభుత్వంపై ప్రతికూల వాతావరణం ఏర్పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇకపై ఎవరూ బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని, క్రమశిక్షణ పాటించాలని సూచించారు.

ఇదే సమయంలో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఫేక్ ఓటర్ ఐడీ కార్డులు, బీసీ రిజర్వేషన్ 42% వంటి అంశాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. బీసీ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తూ, “మాకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే వదలము” అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ చేరికపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో, ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా సీఎం స్పందించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి “హంతకులు, ఫ్యాక్షనిస్టులు పార్టీలోకి రావడం జరగదు” అని క్లారిటీ ఇచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, పథకాల అమలులో లోపాలపై కూడా సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రతి శాఖలో అవినీతి రహిత వ్యవస్థ ఉండాలి. సామాన్యుడికి అందాల్సిన సేవలు అడ్డంకులు లేకుండా చేరేలా చూడాలి” అని సూచించారు.
దీనిపై స్పెషల్ టీం ఏర్పాటు చేయాలని కూడా సూచించినట్టు సమాచారం.

ప్రజల సేవకే ప్రధాన ప్రాధాన్యం ఇవ్వాలని, పార్టీ ప్రతిష్టను దెబ్బతీయే చర్యలు చేయరాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *