ఇళ్లు కూల్చివేతలతో రోడ్డున పడిన పేద కుటుంబాలు – డయాలిసిస్ రోగితో కన్నీటి కథ

ఇళ్లు కూల్చివేతలతో పేద కుటుంబాలు రోడ్డున పడిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బాధితులు కన్నీళ్లతో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. “మేము గరీబులం… మా ఇళ్లు కూల్చేస్తే ఎక్కడికి పోవాలి?” అని ఒక మహిళ వేదన వ్యక్తం చేసింది.

ఆమె భర్త డయాలిసిస్ పేషెంట్ అని, ఈ టెన్షన్ వల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. “ఇంత టెన్షన్ లో ఆయన చచ్చిపోతే నేను ఏమవుతాను?” అని కన్నీటి పర్యంతమైంది.

ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు చిన్నపిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఆరు నెలల చిన్న పాపతో ఎండలో రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు చెబుతున్నారు. “చిన్న పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్లాలి? ఎండలో వాళ్లు ఎలా బతుకుతారు?” అని ప్రశ్నిస్తున్నారు.

ఇక జీవనాధారాలు కూడా కోల్పోయామని బాధితులు చెబుతున్నారు. కొందరి షాపులు, చిన్న వ్యాపారాలు తొలగించడంతో వారి జీవితం సంక్షోభంలో పడింది. “నా కొడుకు పని లేకుండా రోడ్డుపై పడిపోయాడు… అతను ఇప్పుడు ఎలా బతుకుతాడు?” అని ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రభుత్వంపై కూడా బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇది ప్రజాపాలన కాదు… ప్రజలను చంపే పాలన” అంటూ విమర్శించారు. మహిళల సంక్షేమం గురించి చెప్పే ప్రభుత్వం తమలాంటి పేద మహిళల బాధను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

బాధితులు ప్రభుత్వాన్ని కోరుతూ, తక్షణమే తమకు పునరావాసం కల్పించాలని, కనీస మానవతా దృక్పథంతో స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *