రికార్డ్ టెన్త్ ఫలితాలు.. 95% పాస్.. ములుగు టాప్.. 6 ప్రైవేట్ స్కూళ్లలో జీరో రిజల్ట్!

రాష్ట్ర 10వ తరగతి ఫలితాలు ఈసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మొత్తం ఉత్తీర్ణత శాతం 95.15%గా నమోదై విద్యార్థులు సత్తా చాటారు. గత ఏడాదితో పోలిస్తే పాస్ శాతం 2.37% పెరగడం విశేషం. ముఖ్యంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు మరోసారి అద్భుత ఫలితాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాయి.

అయితే మరోవైపు లక్షల ఫీజులు వసూలు చేసే కొన్ని ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి తీవ్ర విమర్శలకు దారితీసింది. రాష్ట్రంలో ఏకంగా ఆరు ప్రైవేట్ స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

బుధవారం ఎస్సీఈఆర్టీ భవన్‌లో 10వ తరగతి ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కేకే కేశవ్‌తో కలిసి విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ వి.పి. శ్రీహరి విడుదల చేశారు.

మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహించగా, ఏప్రిల్ 23 నాటికి వాల్యుయేషన్ పూర్తయింది. మొత్తం 5,28,309 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 5,26,166 మంది పరీక్షలు రాశారు. వీరిలో 4,97,312 మంది ఉత్తీర్ణత సాధించారు.

ఈసారి కూడా అమ్మాయిలే పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 94.70% ఉండగా, బాలికల ఉత్తీర్ణత 96.26%గా నమోదైంది.

జిల్లాల వారీగా చూస్తే ములుగు జిల్లా అత్యధిక ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

రాష్ట్రవ్యాప్తంగా 11,677 హైస్కూళ్లు ఉండగా, వాటిలో 5731 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో ప్రైవేట్, జిల్లా పరిషత్, కేజీబీవీ, గురుకుల, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు కూడా ఉన్నాయి.

అయితే ఆరు ప్రైవేట్ స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. భారీ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ సంస్థలు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తున్నాయా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

ఇక గురుకుల పాఠశాలల ఫలితాలు మాత్రం అందరినీ ఆకట్టుకున్నాయి. సరైన వసతులు లేకపోయినా, ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు, హాస్టల్ సమస్యలు, మౌలిక సదుపాయాల కొరత వంటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గురుకులాల్లో వాష్‌రూమ్స్, హాస్టల్స్, ఆహార నాణ్యత, బోధన సదుపాయాలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇక రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కోసం మే 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్టు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *