స్త్రీనిధిలో భారీ అవకతవకలా..? విద్యాసాగర్ రెడ్డి రీన్యువల్, కొత్త నోటిఫికేషన్లపై తీవ్ర ఆరోపణలు

తెలంగాణలో స్త్రీనిధి సంస్థలో జరుగుతున్న నియామకాలు, నిధుల వినియోగం, రిటైర్డ్ అధికారుల కొనసాగింపుపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి వ్యవహారంపై నిరుద్యోగ వర్గాలు, కొంతమంది ఉద్యమకారులు తీవ్ర స్థాయిలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రాము అనే వ్యక్తి స్త్రీనిధిలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు.

విద్యాసాగర్ రెడ్డి రిటైర్మెంట్ వయస్సు దాటిన తర్వాత కూడా పలుమార్లు ఎక్స్‌టెన్షన్ ఇవ్వడం వెనుక రాజకీయ మరియు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విడుదలైన స్త్రీనిధి నోటిఫికేషన్‌పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉద్యోగాలు పారదర్శకంగా భర్తీ చేయడం లేదని, ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూల ద్వారా తమ అనుచరులను నియమించుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు వచ్చాయి.

కొత్త నోటిఫికేషన్‌లో జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వంటి పోస్టులకు భారీ వేతనాలు ప్రకటించడంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగమా లేదా కాంట్రాక్ట్ పోస్టులా అన్న విషయంలో స్పష్టత లేకపోవడం, రిజర్వేషన్లు, రోస్టర్ విధానం, వయోపరిమితి వంటి అంశాలు స్పష్టంగా పేర్కొనకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

రాము మాట్లాడుతూ స్త్రీనిధి సంస్థలో నియామకాలు పూర్తిగా రాజకీయ ప్రభావంతో జరుగుతున్నాయని ఆరోపించారు. సీతక్క, విద్యాసాగర్ రెడ్డి కలిసి ఉద్యోగాల వ్యవహారాన్ని ప్రభావితం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికే విద్యాసాగర్ రెడ్డిపై విచారణకు సంబంధించిన జీఓలు ఉన్నప్పటికీ, చర్యలు తీసుకోకుండా మళ్లీ కొనసాగింపునివ్వడం వెనుక పెద్దస్థాయి కుమ్మక్కు ఉందని ఆరోపించారు.

అలాగే స్త్రీనిధి సంస్థలో వేల కోట్ల రూపాయల లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని, ట్యాబ్‌లు, కంప్యూటర్లు, ఇతర కొనుగోళ్లలో కూడా భారీ అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగిస్తూ నిరుద్యోగులకు అవకాశాలు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక ఈ నోటిఫికేషన్‌ను కోర్టులో సవాల్ చేస్తామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని రాము హెచ్చరించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *