శివ చౌహాన్ క్లారిటీ: మైక్రో ఫైనాన్స్ స్కాంలో మాకు ఎలాంటి సంబంధం లేదు

తెలుగు సినీ గాయని Mangli కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వేదికల్లో మైక్రో ఫైనాన్స్ స్కాం ఆరోపణలతో మంగళి కుటుంబ సభ్యుల పేర్లు ప్రచారంలోకి రావడంతో ఆమె సోదరుడు శివ చౌహాన్ మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరణ ఇచ్చారు. తమపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, ఇది ఒక పెద్ద కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు.

శివ చౌహాన్ మాట్లాడుతూ గత 14 ఏళ్లుగా మంగళి ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి పేరు సంపాదించుకుందని తెలిపారు. అలాంటి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమ కుటుంబానికి దేవాలయాల పట్ల ప్రత్యేకమైన భక్తి ఉందని, ప్రతి సంవత్సరం పలు ఆలయాలను దర్శించుకోవడం జరుగుతుందని చెప్పారు.

తమపై వైరల్ అవుతున్న ఫోటోల గురించి కూడా శివ చౌహాన్ వివరణ ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే కార్యక్రమానికి హాజరైన తర్వాత మధు అనే వ్యక్తి తమను గ్రామానికి ఆహ్వానించాడని, అక్కడ డిన్నర్ సందర్భంగా తీసుకున్న ఫోటోలను ఇప్పుడు తప్పుడు రీతిలో ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్‌కు ఆహ్వానించడంతో అక్కడికి వెళ్లానని, అక్కడ ఎవరు ఉన్నారో కూడా పూర్తిగా తెలియదని తెలిపారు.

హైదరాబాద్‌లో తమకు ఉన్న వాసవి ఫ్లాట్‌ను అమ్మకానికి పెట్టామని, ఆఫీస్ అవసరాల కోసం చూస్తున్నామని చెప్పిన వ్యక్తులకు ఫ్లాట్ చూపించామని చెప్పారు. ఫ్లాట్ కొనుగోలు ప్రక్రియలో భాగంగానే పరిచయం ఏర్పడిందని, దానికి మించి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని స్పష్టం చేశారు.

తమ పేర్లతో ఎక్కడా ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, ఏ కేసులోనూ తమ పేర్లు లేవని శివ చౌహాన్ పేర్కొన్నారు. కేవలం ఫోటోలు చూపిస్తూ ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం జరగాలని తాము కూడా కోరుకుంటున్నామని, అవసరమైతే చట్టపరమైన విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.

“ఆంజనేయ స్వామి మీద ఒట్టు వేసి చెబుతున్నా… ఈ మైక్రో ఫైనాన్స్ స్కాంలో మాకు ఎలాంటి సంబంధం లేదు” అని శివ చౌహాన్ భావోద్వేగంగా చెప్పారు. తమపై జరుగుతున్న ట్రోలింగ్ వెనుక ఎవరు ఉన్నారో దర్యాప్తులో బయటపడుతుందని అన్నారు.

అలాగే “బండి శివ” అనే వ్యక్తిని “శివ చౌహాన్”గా చూపిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగా తమ కుటుంబ పరువు దెబ్బతింటోందని, క్లీన్ చిట్ వచ్చిన తర్వాత తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.

చివరగా మీడియా కూడా వాస్తవాలను పరిశీలించి మాత్రమే వార్తలు ప్రసారం చేయాలని శివ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. “మేము కూడా బాధితులమే. వాళ్లు డబ్బులు కోల్పోయి ఉంటే, మేము పరువు కోల్పోయాం” అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *