ఐదు రాష్ట్రాల్లో హోరాహోరీ పోరు.. తమిళనాడులో టీవీకే ప్రభంజనం, బెంగాల్‌లో బీజేపీ ముందంజ!

దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే అన్ని రాష్ట్రాల్లో ఉత్కంఠభరిత వాతావరణం కనిపిస్తుండగా, సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది.

బెంగాల్‌లో బీజేపీ జోరు

పశ్చిమ బెంగాల్‌లో ఈసారి బీజేపీ అనూహ్యంగా ముందంజలో ఉన్నట్టు తాజా ట్రెండ్స్ సూచిస్తున్నాయి. ప్రస్తుతం టీఎంసీ 131 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 151 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. దీంతో బెంగాల్ రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి.

భవానిపూర్‌లో మమతా బెనర్జీ ముందంజలో ఉండగా, నందిగ్రామ్‌లో సువేందు అధికారి ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం. ఒక నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ పెండింగ్‌లో ఉండడంతో ఆ స్థానానికి మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ “బెంగాల్‌లో బీజేపీ అద్భుతమైన విజయాన్ని సాధించబోతోంది. తదుపరి టార్గెట్ తెలంగాణ” అంటూ వ్యాఖ్యానించారు.

తమిళనాడులో టీవీకే సంచలనం

తమిళనాడులో ఈసారి అసలు పోటీ డీఎంకే, అన్నాడీఎంకే మధ్యనే ఉంటుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ భారీ ప్రభంజనం సృష్టిస్తోంది.

234 స్థానాలున్న తమిళనాడులో మెజారిటీకి 118 స్థానాలు అవసరం. తాజా ట్రెండ్స్ ప్రకారం టీవీకే పార్టీ 93 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అన్నాడీఎంకే 94 స్థానాల్లో, డీఎంకే కేవలం 58 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉంది.

కొల్లాతూర్ నియోజకవర్గంలో సీఎం స్టాలిన్‌కు చెందిన డీఎంకే అభ్యర్థిపై టీవీకే అభ్యర్థి బీఎస్ బాబు ఆధిక్యంలో ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

విజయ్ పార్టీకి ఇది మొదటి ఎన్నికలే అయినప్పటికీ, ప్రజల్లో ముఖ్యంగా యువతలో భారీ ఆదరణ లభిస్తున్నట్టు ట్రెండ్స్ సూచిస్తున్నాయి. పార్టీ స్థాపించి ఏడాది కూడా కాకముందే ఈ స్థాయి ప్రభావం చూపడం విశేషంగా మారింది.

ఇప్పటికే చెన్నైలో విజయ్ నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. టీవీకే కార్యాలయం వద్ద అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.

అస్సాంలో మళ్లీ బీజేపీ ఆధిక్యం

అస్సాంలో మొత్తం 126 స్థానాలు ఉండగా, మెజారిటీకి 64 స్థానాలు అవసరం. ప్రస్తుతం బీజేపీ 94 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 24 స్థానాల్లో, ఏఐయూడీఎఫ్ రెండు స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి.

దీంతో అస్సాంలో వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కేరళలో యుడిఎఫ్ దూకుడు

కేరళలో మొత్తం 140 స్థానాలు ఉన్నాయి. మెజారిటీకి 71 స్థానాలు అవసరం. ప్రస్తుతం యుడిఎఫ్ 82 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎల్డిఎఫ్ 45 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. బీజేపీ మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

అయితే కేరళలో చివరి దశ కౌంటింగ్ వరకు ఫలితాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ ముందంజ

పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాలు ఉండగా, మెజారిటీకి 16 స్థానాలు అవసరం. ప్రస్తుతం ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో, ఇతరులు మూడు స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు.

యానం ప్రాంతంలో కూడా బీజేపీ అనుకూల కూటమికి ఆధిక్యం ఉన్నట్టు సమాచారం.

దేశవ్యాప్తంగా ఉత్కంఠ

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో టీవీకే ప్రభంజనం, బెంగాల్‌లో బీజేపీ ఆధిక్యం ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇంకా పూర్తి ఫలితాలు రావాల్సి ఉండటంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. సాయంత్రానికి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *