పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు భగీరథ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత Bakka Judson జూబ్లీహిల్స్‌లోని A. Revanth Reddy నివాసం వద్ద నిరసనకు దిగడం ఉద్రిక్తతకు కారణమైంది.
భగీరథను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంట్లోనే దాచిపెట్టారంటూ బక్కా జాడ్సన్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసు నమోదై ఐదు రోజులు గడిచినా ఇప్పటివరకు అరెస్ట్ జరగకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టులతో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన జాడ్సన్ను పోలీసులు అడ్డుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అయితే తాను “ముట్టడి” చేయడానికి పోలేదని, కేవలం నిరసన తెలిపేందుకు మాత్రమే వెళ్లానని బక్కా జాడ్సన్ స్పష్టం చేశారు. “ముట్టడి అంటే వందల మంది వెళ్లాలి.. నేను ఒక్కడినే వెళ్లి ప్రశ్నించాను” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. డీజీపీ కార్యాలయం ముందు కూడా ఇదే డిమాండ్‌తో నిరసన తెలిపినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “భగీరథ సీఎం ఇంట్లోనే ఉన్నాడనే పక్కా సమాచారం ఉంది. అందుకే అక్కడికి వెళ్లాను” అని జాడ్సన్ పేర్కొన్నారు. అలాగే పోక్సో కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా, ప్రశ్నించిన తనను అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు.
ఇక సోషల్ మీడియాలో బాధిత బాలికకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధితురాలిపై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా కేసును బలహీనపరచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఒకవైపు భగీరథ అరెస్ట్‌పై ఒత్తిడి పెరుగుతుండగా, మరోవైపు ఈ కేసు రాజకీయంగా మరింత ముదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ కూడా కీలకంగా మారింది.

