హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మోసం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం, హయత్‌నగర్ పరిధిలోని కోహెడ గ్రామానికి చెందిన పల్లపు గోవర్ధన్ అనే యువకుడు సరిత అనే యువతిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. అనంతరం వారికి ఓ బిడ్డ జన్మించింది.
అయితే కొద్ది రోజుల క్రితం సరిత మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గోవర్ధన్‌కు అడ్డంకిగా మారుతుందని భావించి కన్నబిడ్డను కూడా అమ్మేసిందనే ఆరోపణలు వెలువడ్డాయి.
సరిత వేరే పెళ్లి చేసుకోబోతుందనే విషయం తెలిసిన గోవర్ధన్ తీవ్రంగా కలత చెందాడు. తనతో తిరిగి రావాలని పలుమార్లు వేడుకున్నప్పటికీ ఆమె పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా తన రెండో పెళ్లి పనుల్లో కూడా గోవర్ధన్ చేత పనులు చేయించిందని ఆరోపిస్తున్నారు.
ఈ అవమానాన్ని తట్టుకోలేక గోవర్ధన్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. మే 12న నైట్ డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చిన గోవర్ధన్, మరుసటి రోజు ఉదయం నుంచి గదిలోనే ఉన్నాడు. సాయంత్రం వరకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి చూడగా, అతను ఉరివేసుకొని మృతదేహంగా కనిపించాడు.
ఆత్మహత్యకు ముందు గోవర్ధన్ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. “నా చావుకు కారణమైన సరితను వదలొద్దు” అంటూ అతడు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
గోవర్ధన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు అమ్మేసినట్లు చెబుతున్న చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పేరుతో మోసం చేసి, కన్నబిడ్డను అమ్మేసిన ఘటన అమానుషమని మండిపడుతున్నారు.

