నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో జరుగుతున్న ప్రచారం భారీ చర్చకు దారి తీసింది. ముఖ్యంగా జెన్‌జీ యువత ఈ ప్లాట్‌ఫామ్‌ను భారీగా ఫాలో అవుతుండటంతో ఇది సాధారణ ట్రోల్ పేజీనా? లేక కొత్త తరహా రాజకీయ ఉద్యమానికి నాంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో కేవలం కొన్ని రోజుల్లోనే లక్షల్లో ఫాలోవర్స్ సంపాదించుకున్న ఈ ప్లాట్‌ఫామ్ ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తూ వైరల్ అవుతోంది. దీంతో కొందరు దీన్ని యువత ఆవేదనగా చూస్తుంటే, మరికొందరు విదేశీ శక్తులు సోషల్ మీడియా ద్వారా దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలనే ప్రయత్నమని ఆరోపిస్తున్నారు.
ఈ అంశంపై జర్నలిస్ట్ సిద్ధుతో మాట్లాడగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “ఇది అసలు రాజకీయ పార్టీ కాదు. కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మాత్రమే. నేటి కాలంలో ఎవరైనా ఒక పేరు పెట్టి సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసి ఫాలోవర్స్ పెంచుకోవచ్చు. ఫాలోవర్స్ ఎక్కువగా ఉండటం వల్ల అది రాజకీయ పార్టీ అయిపోదు” అని తెలిపారు.
అలాగే ఆయన మాట్లాడుతూ, “జెన్‌జీ ఉద్యమాలు అవసరమే. కానీ అవి దేశానికి మేలు చేసేలా ఉండాలి. నేపాల్‌లో జరిగినట్లుగా అవినీతి వ్యతిరేక ఉద్యమాలు రావచ్చు. కానీ బంగ్లాదేశ్, శ్రీలంక తరహా అశాంతి సృష్టించే ఉద్యమాలు దేశానికి ప్రమాదకరం” అని అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఒక వ్యాఖ్య నేపథ్యంలో “కాక్రోచ్ జనతా పార్టీ” అనే పేరు వైరల్ అయిందని, దాన్ని కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని చెప్పారు. బీజేపీ వ్యతిరేక ప్రచారం చేయడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అయితే మరోవైపు చాలా మంది యువత మాత్రం ప్రధాన రాజకీయ పార్టీలపై అసంతృప్తితో కొత్త వేదికలను అన్వేషిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలంగాణలో కూడా ఇలాంటి జెన్‌జీ ఉద్యమాలు రావాలనే చర్చ యువతలో కనిపిస్తోంది. నిరుద్యోగం, ప్రభుత్వాల నిర్లక్ష్యం, రాజకీయాలపై విసుగు వంటి కారణాలతో సోషల్ మీడియాలో యువత ప్రత్యామ్నాయ వేదికల వైపు మొగ్గు చూపుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే ఈ ఉద్యమాలు నిజంగా ప్రజల సమస్యల పరిష్కారానికా? లేక కేవలం సోషల్ మీడియా ట్రెండ్స్కే పరిమితమా? అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది.

