దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజలపై భారీ భారం మోపుతున్నాయి. ముఖ్యంగా మే నెలలోనే నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరగడంతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ పూర్తిగా తారుమారైంది. ప్రతి నెల ఒక అంచనాతో కుటుంబ ఖర్చులు ప్లాన్ చేసుకునే ప్రజలు ఇప్పుడు పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మే 1తో పోలిస్తే ప్రస్తుతం కందిపప్పు ధర కిలోకు ₹150 నుంచి ₹162కి చేరింది. శెనగపప్పు ₹84 నుంచి ₹92కి పెరిగింది. మినప్పప్పు ₹122 నుంచి ₹132కి, పెసరపప్పు ₹114 నుంచి ₹122కి పెరిగింది. పామాయిల్ ధర ₹110 నుంచి ₹125కి చేరగా, సన్‌ఫ్లవర్ ఆయిల్ ₹150 నుంచి ₹176కి పెరిగింది. చక్కెర ధర ₹42 నుంచి ₹45కి పెరిగింది. టమాటా ధరలు ₹20 నుంచి ₹35-40 వరకు చేరాయి. అంటే ఒక్క నెలలోనే దాదాపు అన్ని సరుకుల ధరలు ₹10 నుంచి ₹15 వరకు పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది.
ఈ ధరల పెరుగుదల వల్ల ఒక సాధారణ కుటుంబానికి నెలకు అదనంగా ₹1000 నుంచి ₹2000 వరకు సరుకుల ఖర్చు పెరిగినట్లు అంచనా. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కూడా భారీ ప్రభావం చూపుతోంది. రోజుకు రెండు లీటర్ల పెట్రోల్ వినియోగించే కుటుంబానికి నెలకు ₹1000 నుంచి ₹1500 వరకు అదనపు భారం పడుతోంది. మొత్తంగా చూసుకుంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి నెలకు ₹4000 నుంచి ₹5000 వరకు అదనపు ఖర్చు పెరిగిన పరిస్థితి నెలకొంది.
పెట్రోల్ ధరలు మరింత పెరిగి లీటర్‌కు ₹120 దాటే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. రాజకీయ నాయకులు మాత్రం పెట్రోల్ ధరలపైనే మాట్లాడుతున్నారని, కానీ సరుకుల ధరల పెరుగుదలపై పెద్దగా స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య టాక్స్‌ల అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణలో పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం సుమారు 35.2% వ్యాట్ వసూలు చేస్తుండగా, డీజిల్‌పై 27% వ్యాట్ విధిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పెట్రోల్‌పై కేవలం ₹3 మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తోందని, డీజిల్‌పై సెంట్రల్ టాక్స్ లేకుండా చేశామని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.
గతంలో కేంద్ర పన్నులు పెట్రోల్‌పై ₹19.90, డీజిల్‌పై ₹15.80 ఉండేవని, అంతర్జాతీయ పరిస్థితులు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో వాటిని భారీగా తగ్గించామని కేంద్ర ప్రభుత్వం వివరిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యాట్‌ను తగ్గిస్తే ప్రజలకు మరింత ఊరట లభిస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణ దేశంలోనే అత్యధిక ఫ్యూయల్ టాక్స్ విధించే రాష్ట్రాల్లో ఒకటిగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. పెట్రోల్‌పై 35% కంటే ఎక్కువ వ్యాట్ ఉండటంతో సామాన్యులపై భారమంతా పడుతోందని విమర్శలు వస్తున్నాయి.
ఇక పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం కేవలం ఇంధనానికే పరిమితం కాదు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరగడంతో అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. కూరగాయలు, నిత్యావసర సరుకులు, ఇతర అవసరాలన్నీ మరింత ఖరీదవుతున్నాయి. త్వరలో గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందన్న వార్తలు ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కంటే ప్రజలపై పడుతున్న భారం తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గిస్తే కొంతవరకు ధరలు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

