ఖైరతాబాద్ మహాగణపతికి కర్రపూజ ప్రారంభం.. 2026లో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా భక్తులకు దర్శనం

ఖైరతాబాద్ మహాగణపతికి కర్రపూజ ప్రారంభం.. 2026లో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా భక్తులకు దర్శనం

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. 2026 వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా సోమవారం సాయంత్రం ఖైరతాబాద్‌లో సంప్రదాయబద్ధంగా కర్రపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంతో మహాగణపతి విగ్రహ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్, చైర్మన్ సింగరి రాజ్‌కుమార్, ఫౌండర్ ఫ్యామిలీ సభ్యురాలు వీణా మాధురి, కన్వీనర్ సందీప్ రాజు తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ ఏడాది మహాగణపతికి **”పంచముఖ సంకటహర మహాగణపతి”**గా నామకరణం చేసినట్లు కమిటీ వెల్లడించింది. సమాజంలోని అన్ని సంకటాలు తొలగించి ప్రజలకు శుభం కలగాలనే సంకల్పంతో ఈ రూపాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. గణపతి విగ్రహానికి ఒక వైపు సోమనాథ్ సోమలింగేశ్వరుడు, మరోవైపు కాళీమాత ప్రతిరూపాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ప్రశాంతతకు ప్రతీకగా శివుడు, దుష్ట సంహారానికి ప్రతీకగా కాళీమాత, ఈ రెండు శక్తులను సమన్వయం చేసే మహాగణపతి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారని పేర్కొన్నారు.

ఈసారి మహాగణపతి విగ్రహం సుమారు 68 అడుగుల ఎత్తులో రూపొందించనున్నట్లు ఫౌండర్ ఫ్యామిలీ సభ్యురాలు వీణా మాధురి తెలిపారు. గతంలో 70 అడుగుల ఎత్తులో విగ్రహాలను రూపొందించినప్పటికీ, శిల్పకళా నైపుణ్యం, రూప సౌందర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎత్తును 68 అడుగులకు పరిమితం చేసినట్లు చెప్పారు.

అయితే ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలు 72వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ వేడుకలకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడిందని కమిటీ సభ్యులు తెలిపారు. విగ్రహ నిర్మాణానికి సుమారు మూడు నెలల సమయం పడుతుందని, సెప్టెంబర్ 14న వినాయక చవితి సందర్భంగా మహాగణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని వెల్లడించారు.

ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోనున్నారని కమిటీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. సాధారణ రోజుల్లో లక్ష నుంచి రెండు లక్షల మంది, వారాంతాల్లో ఐదు నుంచి ఆరు లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటే భక్తుల కోరికలు నెరవేరుతాయనే విశ్వాసం ప్రజల్లో ఉందని, అందుకే ప్రతి ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. పది రోజుల పాటు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఉత్సవాలు నిర్వహించి అనంతరం సంప్రదాయబద్ధంగా నిమజ్జనం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *