ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్ల కొనుగోళ్లలో అవినీతి ఆరోపణలు.. మంత్రుల సవాల్

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లకు సంబంధించిన కొనుగోళ్ల (ప్రొక్యూర్‌మెంట్)లో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా స్పందించింది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కేటీఆర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది.

మంత్రులు మాట్లాడుతూ.. గతంలో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, హరీష్ రావు, కేటీఆర్ పలుమార్లు హాస్టళ్ల కొనుగోళ్లలో రూ.2,000 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు స్కాం జరిగిందని ఆరోపించారని గుర్తు చేశారు. అయితే అలాంటి వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని అన్నారు.

ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గతంలో ఎస్పీగా పనిచేశారని, ఆయనకు పరిపాలనపై అవగాహన ఉందని పేర్కొంటూ, నిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. అలాగే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రతిపక్ష నేతలు ఎప్పుడైనా బహిరంగ చర్చకు రావాలని ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన ఇతర కార్యక్రమాలను సైతం రద్దు చేసుకుని చర్చకు సిద్ధమైందని, తెలంగాణ ప్రజల ముందు వాస్తవాలను ఉంచేందుకు ఎక్కడైనా చర్చ నిర్వహించడానికి సిద్ధమని తెలిపారు.

రూ.643 కోట్ల కొనుగోళ్లు.. టెండర్ల ద్వారానే

హాస్టళ్ల కోసం మొత్తం రూ.643 కోట్ల విలువైన కొనుగోళ్లు జరిగాయని ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో సుమారు రూ.500 కోట్ల విలువైన కొనుగోళ్లు ప్రభుత్వ రంగ సంస్థలైన టెస్కో, లిడ్‌క్యాప్ వంటి సంస్థల ద్వారా గ్లోబల్ టెండర్ల ప్రక్రియలో పారదర్శకంగా నిర్వహించినట్లు వివరించింది.

గత ప్రభుత్వాల మాదిరిగా నామినేషన్ పద్ధతిలో ఒకే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించలేదని, పూర్తిస్థాయి ఓపెన్ టెండర్ల ద్వారా కొనుగోళ్లు చేపట్టామని పేర్కొంది.

నాలుగు శాఖల సమన్వయంతో కొనుగోళ్లు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు అవసరమైన వస్తువులను సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానంలో ఒకే విధానంతో కొనుగోలు చేశామని తెలిపారు. ఒక శాఖ ఎక్కువ ధరకు, మరో శాఖ తక్కువ ధరకు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా, ఒకే ప్రమాణాలతో పారదర్శకంగా టెండర్లు నిర్వహించినట్లు వెల్లడించారు.

ఈ మొత్తం ప్రక్రియ మంత్రుల పర్యవేక్షణలో, అధికారుల సాంకేతిక పరిశీలనతో జరిగిందని, ప్రతి దశలో నిబంధనలు పాటించామని చెప్పారు.

నాణ్యతే ప్రధాన ప్రమాణం

కొనుగోళ్లలో పాల్గొన్న సంస్థలు ఎక్కడి వారైనా తమకు సంబంధం లేదని, టెండర్లలో అర్హత సాధించిన సంస్థలకే అవకాశం ఇచ్చామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి ప్రశ్నిస్తూ.. “ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఒక నిర్దిష్ట కంపెనీ తయారు చేసిన వస్తువులు వాడకూడదా? నాణ్యత ఉన్న వస్తువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యం” అని పేర్కొన్నారు.

అధికారులు దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లి వస్తువుల నాణ్యతను పరీక్షించిన తర్వాతే కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేశారని ప్రభుత్వం వెల్లడించింది.

అవాస్తవ ఆరోపణలు చేయకుండా ఆధారాలతో మాట్లాడాలని ప్రతిపక్ష నేతలకు సూచిస్తూ, ప్రజల ముందు బహిరంగ చర్చకు రావాలని ప్రభుత్వం మరోసారి సవాల్ విసిరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *