ఓటర్ జాబితా సవరణకు గడువు పెంపు.. ఆగస్టు 10 వరకు అవకాశం, హైదరాబాద్‌లో ఓటర్ల సంఖ్య తగ్గే సంకేతాలు

ఓటర్ జాబితా సవరణకు గడువు పెంపు.. ఆగస్టు 10 వరకు అవకాశం, హైదరాబాద్‌లో ఓటర్ల సంఖ్య తగ్గే సంకేతాలు

రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గడువు పొడిగించింది. ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు ముందుగా నిర్ణయించిన ఆగస్టు 3 గడువును ఆగస్టు 10, 2026 వరకు పెంచింది. పట్టణ ప్రాంతాల్లో ఫారాల సమర్పణ నెమ్మదిగా సాగుతుండటం, రాజకీయ పార్టీలు మరియు రాష్ట్ర ఎన్నికల అధికారుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

కొత్త షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ జాబితాను ఆగస్టు 17న విడుదల చేయనున్నారు. అనంతరం క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన పూర్తయ్యాక అక్టోబర్ 19, 2026న తుది ఓటర్ జాబితాను ప్రకటిస్తారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 3,38,26,448 మంది ఓటర్లు నమోదై ఉండగా, ఇప్పటివరకు 2,60,88,334 మంది తమ ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

జిల్లాల వారీగా చూస్తే భువనగిరి జిల్లాలో 94.25 శాతం, జనగామలో 91.44 శాతం, మెదక్‌లో 90.52 శాతం, సూర్యాపేటలో 90.35 శాతం, మహబూబాబాద్‌లో 90.08 శాతం మంది తమ ఫారాలను సమర్పించి ముందంజలో ఉన్నారు.

అయితే పట్టణ ప్రాంతాల్లో స్పందన తక్కువగా నమోదైంది. హైదరాబాద్ జిల్లాలో కేవలం 56.31 శాతం, మేడ్చల్ జిల్లాలో 61.37 శాతం, రంగారెడ్డి జిల్లాలో 63.43 శాతం మంది మాత్రమే తమ ఫారాలను సమర్పించారు. దీంతో హైదరాబాద్‌లో తుది ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది.

ఇప్పటికీ 49,90,430 మంది ఓటర్లు తమ ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించలేదు. వీరు ఓటు హక్కును కొనసాగించాలంటే ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. అధికారులు పత్రాలను పరిశీలించిన తర్వాత మాత్రమే వారి ఓటు కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటారు.

పరిశీలనలో ఇప్పటివరకు 2,58,231 మంది చనిపోయినట్లు లేదా ఇతర ప్రాంతాలకు మారినట్లు గుర్తించారు. అలాగే 2,83,366 మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు తేలింది. దీంతో మొత్తం 5,41,597 మంది ఓటర్ల పేర్లను తొలగించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం పేర్కొంది.

ఇదిలా ఉండగా, షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎన్యుమరేషన్ ఫారాల స్కానింగ్‌లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఫారాల్లో ఎలాంటి వివరాలు నమోదు చేయకపోయినా వాటిని స్కాన్ చేసి సమర్పించినట్లు స్థానిక బీజేపీ నాయకులు ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారులు వెంటనే విచారణ చేపట్టి షేర్లింగంపల్లిలో స్కాన్ చేసిన ఫారాలను మళ్లీ పరిశీలిస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ర్యాండమ్ వెరిఫికేషన్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

సవరించిన షెడ్యూల్

• ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ చివరి తేదీ – ఆగస్టు 10, 2026

• పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ – ఆగస్టు 10, 2026

• ముసాయిదా ఓటర్ జాబితా విడుదల – ఆగస్టు 17, 2026

• క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ – ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు

• అభ్యంతరాల పరిష్కారం – అక్టోబర్ 15 వరకు

• తుది ఓటర్ జాబితా విడుదల – అక్టోబర్ 19, 2026

ఎన్నికల సంఘం ప్రకారం ఆగస్టు 10 చివరి అవకాశం. ఇంకా ఫారాలు సమర్పించని ఓటర్లు ఈ గడువులోగా అవసరమైన పత్రాలతో దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి వంటి పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు తమ ఓటు హక్కు కోల్పోకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అలాగే హైదరాబాద్‌లో ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం వెనుక మరో ప్రధాన కారణంగా ద్వంద్వ ఓటు నమోదును అధికారులు ప్రస్తావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన కొందరు తమ స్వగ్రామాల్లోనే ఓటు కొనసాగించాలని నిర్ణయించుకోవడంతో నగరంలోని ఓటర్ల సంఖ్యలో మార్పులు కనిపించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. అక్టోబర్ 19న విడుదలయ్యే తుది ఓటర్ జాబితాతో రాష్ట్రంలోని ఓటర్ల ఖచ్చితమైన సంఖ్యపై పూర్తి స్పష్టత రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *