హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన ముగిసిన నేపథ్యంలో, బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ చుట్టూ తీవ్ర వివాదం చెలరేగింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి, అలాగే సునీత నామినేషన్లు ఓకే అయినప్పటికీ, సునీత అభ్యర్థిత్వంపై మాగంటి గోపీనాథ్ కుటుంబం తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది.
మాగంటి గోపీనాథ్ తొలి భార్య కోసరాజు మాలిని దేవి కుమారుడు తారక్ ప్రద్యుమ్న కోసరాజు, ఎన్నికల కమిషన్‌కి లేఖ రాసి, సునీత మాగంటి గోపీనాథ్‌కి అధికారిక భార్య కాదని, ఆమె లివింగ్ రిలేషన్‌షిప్‌లో మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు.
అతను లేఖలో ఇలా రాశారు —
“నా తండ్రి మాగంటి గోపీనాథ్ గారు నా తల్లి కోసరాజు మాలిని దేవితో 1998లో చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఆయన మరణం వరకు విడాకులు లేవు. మాగంటి సునీత కేవలం లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయినా ఆమె తన ఎఫిడవిట్‌లో ‘లీగల్ వైఫ్’గా పేర్కొని తప్పుడు సమాచారం ఇచ్చారు.”
ఈ లేఖతో పాటు, పుట్టిన సర్టిఫికెట్, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు వంటి పత్రాలు కూడా ఈసీకి సమర్పించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఎన్నికల కమిషన్ సునీత నామినేషన్‌ను అంగీకరించడం పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోసరాజు కుటుంబం సమర్పించిన డాక్యుమెంట్లన్నీ అధికారికంగా అంగీకరించబడినా, ఆమె నామినేషన్ ఎలా ఓకే అయిందన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇది ఎలక్షన్ చివరి నిమిషంలో లేవనెత్తిన రాజకీయ వ్యూహం అని అభిప్రాయపడుతున్నారు. అధికార పార్టీ ప్రత్యర్థి అభ్యర్థిని బలహీనపరచడానికి కుట్రపూరితంగా ఈ వివాదం తెరపైకి తెచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుతం, ఎన్నికల కమిషన్ ఏ ఆధారాలపై సునీత నామినేషన్‌ను ఆమోదించిందో అన్నది ముఖ్య అంశంగా మారింది. ఈ వివాదం జూబ్లీహిల్స్ బైఎలక్షన్‌ను మరింత ఆసక్తికరంగా మార్చింది.

