జాయింట్ సబ్ రిజిస్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు: 100 కోట్ల అక్రమాస్తులు వెలుగులోకి

రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు శుక్రవారం విస్తృత సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో చేపట్టిన ఈ దాడుల్లో సుమారు ₹100 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం.

మధుసూదన్ రెడ్డి బంధువులు, స్నేహితులు, బినామీలకు సంబంధించిన ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫార్మ్ హౌసులు, ఓపెన్ ఫ్లాట్లు, వాణిజ్య స్థలాలు, వ్యవసాయ భూములు ఉన్నట్టు గుర్తించారు. సోదాల సమయంలో ₹9 లక్షల నగదు, సుమారు 1.2 కిలోల బంగారు ఆభరణాలు, కీలక ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ సంపాదనను మల్లించేందుకు కుటుంబ సభ్యుల పేర్లపై రెండు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా పెట్టుబడులు పెట్టినట్టు ప్రాథమిక విచారణలో తేలినట్టు ACB అధికారులు తెలిపారు. అధికారికంగా ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ ₹7.83 కోట్లుగా ఉన్నప్పటికీ, వాటి మార్కెట్ విలువ ₹100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో ఈసీఐఎల్ ప్రాంతంలో 300 చదరపు గజాల్లో నిర్మించిన ట్రిపుల్ ఎక్స్ ఇండిపెండెంట్ హౌస్, ఇబ్రహింపట్నం మండలం చింతపల్లిగూడలో ఓపెన్ ఫ్లాట్, పరిగి మండలంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి, మంగల్పల్లిలో వాణిజ్య భూమి, స్విమ్మింగ్ పూల్‌తో కూడిన ఫార్మ్ హౌస్ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అదనంగా విలాసవంతమైన కార్లు, ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

మధుసూదన్ రెడ్డి హయాంలో భూ రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసినట్టు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో మరింత లోతైన విచారణ జరిపితే పలువురు అధికారులూ, రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతం ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్టు ACB అధికారులు తెలిపారు. అదనపు ఆస్తులు, లావాదేవీలపై తదుపరి తనికీలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *