మంగ్లీపై తీవ్ర ఆరోపణలు: SIT విచారణ కోరిన అడ్వకేట్ సుబ్బు

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అడ్వకేట్ సుబ్బు సంచలన ఆరోపణలు చేశారు. గాయని మంగ్లీ, ఆమె కుటుంబ సభ్యులు, కొందరు కీలక వ్యక్తులపై ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, “మంగ్లీ గారు, ఆమె తమ్ముడు శివ చౌహాన్ ఈ వ్యవహారానికి తమకు సంబంధం లేదని మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు చెప్పారు. కానీ గద్వాల్, నల్గొండ, గచ్చిబౌలి EOW కేసుల్లో వారి పేర్లు FIRల్లో ఉన్నాయని” అన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు, ఫోటోలు, వీడియోలను మీడియాకు అందిస్తున్నామని తెలిపారు.

అడ్వకేట్ సుబ్బు ప్రకారం, ప్రధాన నిందితులుగా ఉన్న రమావత్ మధు, హేమాకాంత్ రెడ్డి తదితరులతో మంగ్లీ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు కూడా జరిగినట్లు పోలీసులే వెల్లడించారని చెప్పారు. “ఎవరో తెలియదని చెప్పిన వ్యక్తులు మీ ఇంట్లోకి ఎలా వచ్చారు? మీ కుటుంబ సభ్యులతో ఎలా తిరిగారు?” అంటూ మంగ్లీని ప్రశ్నించారు.

ఇక మిర్చి తోట, వంగ తోటల వద్ద తీసిన ఫోటోలు, నోట్ల కట్టలు లెక్కపెడుతున్న వీడియోలు కూడా బయటపెట్టామని సుబ్బు పేర్కొన్నారు. “వీటిలో కనిపిస్తున్న వ్యక్తులు ఎవరన్న దానిపై మంగ్లీ గారు స్పష్టత ఇవ్వాలి” అన్నారు.

డీజీపీ CV ఆనంద్‌పై అసంతృప్తి

నిన్న డీజీపీ కార్యాలయానికి వెళ్లి డీజీపీ సివి ఆనంద్‌ను కలిసినట్లు సుబ్బు తెలిపారు. అయితే మొదట సానుకూలంగా స్పందించినప్పటికీ, తరువాత బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.

“దాదాపు 40 మంది బాధితులతో కలిసి గంటల తరబడి వేచి చూసినా, మా వాదనలు పూర్తిగా వినలేదు. మాకు రక్షణ కావాలని అడిగితే ‘అందరికీ రక్షణ ఇవ్వడం మా పని కాదు’ అన్నట్టుగా స్పందించారు. ఇది చాలా బాధాకరం” అని అన్నారు.

తనకు ప్రాణహాని ఉందని, గతంలో కూడా బెదిరింపులు వచ్చాయని చెబుతూ, “నాకు ఏదైనా జరిగితే మంగ్లీ గారిదే, డీజీపీ సివి ఆనంద్ గారిదే బాధ్యత” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

SIT లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ కోరుతూ

ఈ కేసు సాధారణ మోసం కాదని, వందల కోట్ల స్కామ్ జరిగిందని సుబ్బు ఆరోపించారు. “బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టారు. మెదక్ ప్రాంతంలో వందల ఎకరాలు కొనుగోలు చేశారని సమాచారం ఉంది. ఈ వ్యవహారం లోతుగా విచారించాలంటే SIT లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలి” అని డిమాండ్ చేశారు.

అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి, “బాధితులు తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఆలస్యమైన న్యాయం కూడా అన్యాయమే అవుతుంది” అని విజ్ఞప్తి చేశారు.

బాధితుల పరిస్థితి దారుణం

నల్గొండ, దేవరకొండ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ డబ్బులు తిరిగి వస్తాయో లేదో అన్న ఆందోళనలో ఉన్నారని చెప్పారు. “ఎంతో మంది అప్పులు చేసి, బంగారం అమ్మి డబ్బులు పెట్టారు. ఇప్పుడు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితుల తరఫున పోరాడుతున్న తనపై కూడా దాడులకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. “కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు మీడియా కార్యాలయం వద్ద దాడి చేయడానికి ప్రయత్నించారు. ఫోన్ల ద్వారా బెదిరింపులు వస్తున్నాయి” అన్నారు.

చర్చలకు సిద్ధమన్న సుబ్బు

మంగ్లీ స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా ముందుకు వస్తే, కేసులను ఉపసంహరించుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని సుబ్బు తెలిపారు. “మా లక్ష్యం ఒకటే.. బాధితులకు న్యాయం జరగాలి. ఇంకెవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదు” అని అన్నారు.

ఇక మంగ్లీ మేనేజర్ ప్రెస్‌మీట్ పెట్టడంపైనా ప్రశ్నలు లేవనెత్తుతూ, “కేసుతో సంబంధం లేకపోతే ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు?” అని ప్రశ్నించారు.

చివరగా ప్రజలను ఉద్దేశించి, “ఎవరు సెలబ్రిటీ అన్నది ముఖ్యం కాదు. బాధితులకు న్యాయం జరిగేలా సమాజం ముందుకు రావాలి” అని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *