పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌కు కోర్టులో ఊరట లభించలేదు. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలంటూ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తక్షణ ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. రాత్రి 9 గంటల నుంచి 11:40 గంటల వరకు ఇరు వర్గాల న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించగా, కోర్టు తీర్పును గురువారానికి వాయిదా వేసింది.
ఈ కేసులో బండి భగీరథ్ విచారణకు సహకరిస్తానని, రెండు రోజుల్లో హాజరవుతానని తెలిపినప్పటికీ ఇప్పటికీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సాధారణ వ్యక్తి అయితే పోలీసులు కుటుంబ సభ్యులను, స్నేహితులను ప్రశ్నిస్తూ వేగంగా దర్యాప్తు చేస్తారని, కానీ ఇక్కడ మాత్రం ఆలస్యం జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు బాధిత బాలిక తల్లి విడుదల చేసిన బహిరంగ లేఖ తీవ్ర సంచలనం సృష్టించింది. తమ కుమార్తెపై జరిగిన ఘటన, కుటుంబం ఎదుర్కొంటున్న మానసిక వేదన, పోలీస్ స్టేషన్‌లో ఎదురైన అనుభవాలు, రాజకీయ ఒత్తిళ్లు, సోషల్ మీడియా దుష్ప్రచారం వంటి అంశాలను ఆమె లేఖలో ప్రస్తావించారు.
మా బిడ్డకు న్యాయం కావాలి. మాకు రాజకీయాలు తెలియవు. మేము సాధారణ మధ్యతరగతి కుటుంబం. మా కుమార్తె గౌరవం, భవిష్యత్తు కాపాడాలని మాత్రమే కోరుతున్నాం” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద ఉన్న చాట్స్, డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాలని కూడా విజ్ఞప్తి చేశారు.
బాలిక మైనర్ అని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, కావాలనే వయస్సు అంశంపై గందరగోళం సృష్టించి విచారణను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కుటుంబం ఆరోపించింది. పోక్సో చట్టం ప్రకారం మైనర్ బాలిక గుర్తింపును రహస్యంగా ఉంచాల్సిన బాధ్యత సమాజంపైన కూడా ఉందని లేఖలో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఒకవైపు రాజకీయ ఆరోపణలు, మరోవైపు బాధిత కుటుంబం ఆవేదన మధ్య కేసు మరింత సంచలనంగా మారింది.

