నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక్కరోజులోనే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పై ₹993 పెరగడం చిన్న విషయం కాదని సామాన్యులు, వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న చిన్న హోటళ్లు, టీ స్టాల్లు, టిఫిన్ సెంటర్లు, ఫుట్‌పాత్ వ్యాపారులు ఈ నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల ప్రభావంతో గ్యాస్ కొరత నెలకొంది. మార్కెట్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు బ్లాక్‌లో ₹7000 నుంచి ₹10,000 వరకు అమ్ముడవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. గ్యాస్ దొరకక చాలామంది చిన్నకారు వ్యాపారులు తమ షాపులు మూసివేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా మరో భారీ పెంపు ప్రకటించడంతో మిగిలిన వ్యాపారాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా నిర్ణయం ప్రకారం 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పై ₹993 పెంచారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర ₹3071కి చేరుకోగా, హైదరాబాద్‌లో ఇది సుమారు ₹3300 దాటినట్టు సమాచారం. ఈ కొత్త ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు లేదని ప్రకటించినప్పటికీ, మరో ఐదు నుంచి ఆరు రోజుల్లో పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ₹4 నుంచి ₹5 వరకు పెరుగుదల ఉండొచ్చని, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై ₹40 నుంచి ₹50 వరకు భారం పడవచ్చని సమాచారం.
ఈ పెంపులకు ప్రధాన కారణంగా హార్మోజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలను ప్రభుత్వం పేర్కొంటోంది. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. అలాగే 40 శాతం క్రూడ్ ఆయిల్, 50 శాతం ఎల్ఎన్జీ, 70 నుంచి 90 శాతం ఎల్పీజీ కూడా హార్మోజ్ మార్గం ద్వారానే దేశానికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భారీగా పెరగడంతో దేశీయంగా కూడా ప్రభావం పడుతోందని చెబుతున్నారు.
ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా హోటల్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు రెట్టింపు ధరలకు గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేస్తున్నాయి. గతంలో ₹2000 ప్రాంతంలో ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు ₹4000 వరకు బ్లాక్ మార్కెట్లో వెళ్లిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు అధికారిక ధర కూడా ₹3000 దాటడంతో బ్రోకర్లు మరింత అధిక ధరలకు అమ్మే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ అదనపు భారం చివరకు సామాన్యులపైనే పడనుంది. హోటళ్లు, టీ స్టాల్లు తమ ఖర్చులను భరించలేక టిఫిన్లు, భోజనాల ధరలను పెంచే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, గ్యాస్ ధరల పెంపు మరింత భారంగా మారనుంది.
చిన్న చితక హోటళ్లు, ఫుట్‌పాత్ వ్యాపారులు, టీ స్టాల్లు మూతపడే ప్రమాదం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఉత్పత్తుల ధరలు పెరిగితే డిమాండ్ తగ్గిపోతుందని, వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

