నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. మంగ్లీపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మైక్రో ఫైనాన్స్ స్కాం వ్యవహారం రోజురోజుకీ మరింత సంచలనంగా మారుతోంది. ఇప్పటికే ఈ కేసులో బాధితుల తరఫున గిరిజన సంఘాలు, బంజారా సంఘాలు, దళిత సంఘాలు ముందుకు వచ్చి మద్దతు తెలుపుతున్నాయి. మంగళి మరియు ఆమె టీమ్ పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో గిరిజన నాయకులు మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. “మంగళి తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని, కేవలం భోజనానికి వెళ్లినందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. కానీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న ఫోటోలు, వీడియోలు, విజువల్స్ చూస్తుంటే బాధితుల ఆరోపణల్లో నిజం ఉందనే అనుమానాలు పెరుగుతున్నాయి” అన్నారు.
వారి ప్రకారం.. వేలాది మంది బంజారా, గిరిజన కుటుంబాలు రూపాయి రూపాయి కూడబెట్టి తమ పిల్లల భవిష్యత్తు, పెళ్లిళ్లు, కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులను అధిక వడ్డీ ఆశ చూపించి సేకరించారని ఆరోపించారు. “ఐదు రూపాయలు, పది రూపాయల వడ్డీ ఆశ చూపించి కోట్ల రూపాయలు సేకరించి ఇప్పుడు ప్రజలను రోడ్డున పడేశారు” అని సంఘ నాయకులు మండిపడ్డారు.
ఇప్పటికే ఈ వ్యవహారంతో పలువురు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల డబ్బులు వెంటనే రికవరీ చేసి వారికి అందించాలని పోలీస్ శాఖ, ఈఓడబ్ల్యూ అధికారులను కోరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐజీ, పోలీస్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తూ.. “ఇది సాధారణ మోసం కాదు. మారుమూల గ్రామాల్లో బతికే అమాయక గిరిజన కుటుంబాల జీవితాలపై దాడి జరిగింది. డబ్బులు ఎక్కడికి వెళ్లాయి? ఎవరి వద్ద ఉన్నాయి? పూర్తి దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలి” అని డిమాండ్ చేశారు.
ఈ పోరాటంలో అన్ని కుల సంఘాలు, గిరిజన సంఘాలు, దళిత సంఘాలు కలిసి బాధితుల తరఫున నిలబడాలని పిలుపునిచ్చారు. “ఆటో డ్రైవర్లు, రిక్షా కార్మికులు, చిన్న వ్యాపారులు తమ కష్టార్జితాన్ని కోల్పోయారు. వాళ్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి” అని అన్నారు.
మంగళి తనను తాను బాధితుల తరఫున పోరాడతానని గతంలో చెప్పిందని, అయితే ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. “ఒక గిరిజన జాతిలో పుట్టి అదే జాతి ప్రజలను నష్టపరిచే పరిస్థితి రావడం బాధాకరం” అని తీవ్రంగా విమర్శించారు.
కొంతమంది తమపై “డబ్బులు ఇవ్వలేదు కాబట్టే మంగళికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు” అనే ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించగా, సంఘ నాయకులు తీవ్రంగా స్పందించారు. “మేము డబ్బులు తీసుకుని మాట్లాడే నాయకులు కాదు. 40 ఏళ్లుగా బంజారా సమాజం కోసం పని చేస్తున్నాం. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.
అలాగే బాధితులకు ధైర్యం చెబుతూ.. “ప్రాణాలు తీసుకోవద్దు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మీకు న్యాయం జరిగేలా చేస్తాం” అని హామీ ఇచ్చారు.

