స్మశానవాటికలో ప్రాజెక్ట్ పనులపై వివాదం… స్థానికుల ఆందోళన, రీడిజైన్ చేయాలని డిమాండ్

హైదరాబాద్‌లో ప్రతిపాదిత అభివృద్ధి ప్రాజెక్ట్‌పై కొత్త వివాదం చెలరేగింది. స్మశానవాటిక ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాధులు ఉన్న ప్రదేశాన్ని తవ్వుతూ ప్రాజెక్ట్ పనులు చేపట్టడం మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీస్తుందని వారు అంటున్నారు.

స్థానికుల ప్రకారం అక్కడ చాలా కాలంగా ఉన్న సమాధులు బయటపడుతున్నాయని, కొన్ని సమాధులు తాజాగా నిర్మించినవే కూడా ఉన్నాయని చెబుతున్నారు. సమాధులపై నిర్మాణాలు చేయడం లేదా విగ్రహాలు ఏర్పాటు చేయడం పూర్తిగా తప్పు అని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో గాంధీ విగ్రహం నిర్మించాలని భావిస్తున్నారన్న వార్తలపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ ప్రాజెక్ట్ వల్ల తమ నివాసాలపై కూడా ప్రభావం పడుతుందని అపార్ట్మెంట్ నివాసితులు చెబుతున్నారు. సుమారు 420 కుటుంబాలు ఉన్న అపార్ట్మెంట్లు 2004లో అనుమతులు తీసుకుని నిర్మాణం ప్రారంభమై 2010లో పూర్తయ్యాయని, అప్పటి నుంచి అక్కడే నివసిస్తున్నామని వారు తెలిపారు. 14 సంవత్సరాలుగా నివసిస్తున్న కుటుంబాలను ఒక్కసారిగా తరలించడం అన్యాయం అని వారు అంటున్నారు.

అక్కడ నివసిస్తున్న వారిలో రిటైర్డ్ మరియు సర్వింగ్ డిఫెన్స్ సిబ్బంది, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, డాక్టర్లు, జర్నలిస్టులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. సమీపంలో ఆర్టిలరీ ఫైరింగ్ రేంజ్ వంటి డిఫెన్స్ ప్రాంతాలు ఉన్నందున భద్రతా అంశాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

ప్రాజెక్ట్‌కు సంబంధించిన డీపీఆర్ (Detailed Project Report) ఇంకా విడుదల కాలేదని, అయినప్పటికీ ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి భారీ రుణం వస్తుందని ప్రచారం జరుగుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ముందుగా ప్రాజెక్ట్ పూర్తి వివరాలు వెల్లడించి, సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ మరియు పర్యావరణ అంశాలను పరిశీలించాలని వారు కోరుతున్నారు.

అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఇళ్లను కూల్చడం, స్మశానవాటికను తవ్వడం వంటి చర్యలు చేయకుండా ప్రాజెక్ట్‌ను రీడిజైన్ చేయాలని ప్రభుత్వం ముందుకు రావాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వానికి ఇతర ప్రాంతాల్లో భూములు ఉన్నాయని, అక్కడే ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయవచ్చని వారు సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, స్థానికుల అభ్యంతరాలకు ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *