తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర డీజీపీగా సేవలందించిన శివధర్ రెడ్డి పదవీ విరమణ చేయగా, ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ మైదానంలో శివధర్ రెడ్డికి ఘనంగా ఫెయర్వెల్ పెరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు హాజరై ఆయన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కొత్త డీజీపీ సీవీ ఆనంద్, మావోయిస్టుల నిర్మూలన కోసం చేపట్టిన ఆపరేషన్లలో శివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ప్రత్యేక బలగాల సమన్వయంతో మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడంలో ఆయన నాయకత్వం ఎంతో ప్రభావవంతంగా నిలిచిందన్నారు.
అదే సమయంలో భవిష్యత్తులో సమాజానికి ప్రధాన సవాళ్లుగా సైబర్ నేరాలు, డ్రగ్స్ ముప్పు మారబోతున్నాయని సీవీ ఆనంద్ హెచ్చరించారు. కాలానుగుణంగా నేరాల స్వభావం మారుతోందని, ఈ కొత్త తరహా నేరాలపై తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. యువ అధికారులు నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.
ఇదిలా ఉండగా, పదవీ విరమణ చేసిన శివధర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను ప్రభుత్వ భద్రతా సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హోదాలో ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి ప్రోటోకాల్ కల్పించనున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుకు కూడా ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఆయనను క్యాబినెట్ ర్యాంక్ హోదాలో బీసీ సంక్షేమ అభివృద్ధి సలహాదారుగా నియమించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వి.హెచ్‌కు కీలక బాధ్యతలు వస్తాయన్న చర్చ కొనసాగుతుండగా, ఇప్పుడు అధికారికంగా ఆయనకు పదవి లభించింది.
బీసీ వర్గాల సమస్యలపై ఎప్పటినుంచో గళం విప్పుతున్న వి.హెచ్, పలు బీసీ సంఘాల కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై ఆయన గట్టిగా స్పందిస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ పదవి దక్కిన నేపథ్యంలో అదే అంశాలపై ఆయన ఎలా వ్యవహరిస్తారన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు ఉద్యమ నాయకుడిగా మాట్లాడిన వి.హెచ్, ఇకపై ప్రభుత్వ బాధ్యతల్లో ఉండి బీసీలకు హామీ ఇచ్చిన అంశాలను ఆచరణలో అమలు చేయించగలరా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

