1500 ఎకరాల్లో డేటా సిటీ.. రైతుల భూముల పరిస్థితి ఏంటి? తెలంగాణ యువతకు ఉద్యోగాలు దక్కుతాయా?

హైదరాబాద్ చుట్టూ “ఫ్యూచర్ సిటీ”, “డేటా సిటీ”, “ఇన్వెస్ట్ తెలంగాణ” పేర్లతో ప్రభుత్వం భారీ ప్రణాళికలు ప్రకటిస్తుండగా ఇప్పుడు ప్రధాన చర్చ భూములపైనే నడుస్తోంది. 1500 ఎకరాల్లో డేటా సిటీ నిర్మాణం, పరిశ్రమల పార్కులు, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు అంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నా… అసలు ఈ భూములు ఎక్కడి నుంచి వస్తాయి? రైతుల పరిస్థితి ఏంటి? స్థానిక యువతకు ఉద్యోగాలు ఎంతవరకు వస్తాయి? అన్న ప్రశ్నలు మాత్రం తీవ్రంగా వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం చెబుతున్నది అభివృద్ధి, పెట్టుబడులు, ప్రపంచ స్థాయి నగర నిర్మాణం. కానీ గ్రామాల్లో వినిపిస్తున్నది మాత్రం భూములు పోతాయన్న భయం. ఎందుకంటే 1500 ఎకరాలు అంటే చిన్న విషయం కాదు. డేటా సిటీ, ఫ్యూచర్ సిటీ, ఇండస్ట్రియల్ పార్కులు, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, బుల్లెట్ ట్రైన్, ఇతర మౌలిక వసతులు అన్నీ కలిపి చూస్తే వేల ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఇప్పటికే 77 గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశముందన్న చర్చ కూడా జరుగుతోంది.

ఇక్కడ ప్రధాన ప్రశ్న రైతులదే. రైతు తన భూమిని ఇస్తే ప్రభుత్వం లేదా కంపెనీలు ఒకసారి డబ్బు ఇస్తాయి. కానీ భూమి కోల్పోయిన తర్వాత రైతు జీవితం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎకరానికి కోటి, రెండు కోట్లు ఇస్తామని చెప్పినా… అదే భూమిని భవిష్యత్తులో పెట్టుబడిదారులు వందల కోట్లకు అమ్ముకునే పరిస్థితి వస్తే అసలు లాభం ఎవరికన్న ప్రశ్న వస్తోంది. రైతు మాత్రం తన పాత జీవనాధారాన్ని కోల్పోయి కొత్త ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇంకో కీలక అంశం ఉద్యోగాలది. ప్రభుత్వం భారీగా కంపెనీలు వస్తున్నాయని చెబుతోంది. కానీ స్థానిక తెలంగాణ యువతకు ఉద్యోగాల్లో ఎంత ప్రాధాన్యం ఉంటుందో స్పష్టత లేదని యువత ప్రశ్నిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు, మల్టీనేషనల్ సంస్థలు వందల సంఖ్యలో ఉన్నా… నిరుద్యోగం మాత్రం తగ్గలేదని విమర్శిస్తున్నారు. “తెలంగాణలో కంపెనీ పెడితే కనీసం 20% లేదా 30% ఉద్యోగాలు స్థానిక యువతకే ఇవ్వాలి” అనే నిబంధన ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు.

అదే సమయంలో మరో అంశం భూముల ధరలు. జూన్ 1 నుంచి భూముల మార్కెట్ విలువలు పెరగబోతున్నాయని వార్తలు రావడం, అదే సమయంలో ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల ప్రకటనలు రావడం యాదృచ్ఛికమా? లేక ప్రజలను ఆకర్షించే వ్యూహమా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా “క్యూర్ – ప్యూర్” పరిధిలో భూముల విలువలు భారీగా పెరుగుతాయని ప్రచారం జరుగుతుండటంతో… రాబోయే భూసేకరణకు ఇదే బేస్ తయారు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు తీసుకురావడం, హెల్త్ క్లస్టర్లు, డేటా సెంటర్లు, పరిశ్రమలు, రీసెర్చ్ హబ్‌లు ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ భవిష్యత్తు మారుతుందని చెబుతోంది. గ్రూప్-1 స్థాయి అధికారులతో ప్రత్యేక ఇన్వెస్ట్ సెల్, అంతర్జాతీయ నగరాల మాదిరి మౌలిక వసతులు, కొత్త ఇండస్ట్రియల్ పాలసీలు అన్నీ అభివృద్ధి దిశగా అడుగులేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.

అయితే విమర్శకులు మాత్రం ఒకే ప్రశ్న అడుగుతున్నారు — ఇప్పటికే అభివృద్ధి చెందిన హైదరాబాద్‌కే మళ్లీ అన్నీ కేంద్రీకరించాల్సిన అవసరం ఏమిటి? వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి నగరాల్లో ప్రభుత్వ భూములు ఉన్నప్పుడు అక్కడే డేటా సెంటర్లు, పరిశ్రమలు పెడితే స్థానిక అభివృద్ధి కూడా జరుగుతుందని అంటున్నారు. లేకపోతే హైదరాబాద్ చుట్టూ భూముల విలువలు పెంచి, పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే మోడల్‌గా మారిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక జర్నలిస్టులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు 500 ఎకరాల కేటాయింపుల చర్చ కూడా రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. నిజంగా సాధారణ జర్నలిస్టులకు ప్రయోజనం ఉంటుందా? లేక అధికారాలకు దగ్గరగా ఉన్న కొద్ది మంది మాత్రమే లాభపడతారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి “ఫ్యూచర్ సిటీ” ఇప్పుడు కేవలం అభివృద్ధి ప్రాజెక్ట్ కాదు. ఇది భూములు, రైతులు, ఉద్యోగాలు, పెట్టుబడులు, తెలంగాణ యువత భవిష్యత్తు అన్న అన్ని అంశాల చుట్టూ తిరుగుతున్న పెద్ద రాజకీయ – సామాజిక చర్చగా మారుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *