హైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్‌లపై పెరుగుతున్న అక్రమ ఆక్రమణలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాదచారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఫుట్‌పాత్‌లను పూర్తిగా ఖాళీ చేయించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించింది. జూన్ 9లోపు పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని కూడా స్పష్టం చేసింది.
నగరంలో అనేక ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురవుతున్నాయి. కొబ్బరి బోండాలు, టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫ్రూట్ బండ్లు, ఇతర చిన్న వ్యాపారాలు ఫుట్‌పాత్‌లను ఆక్రమించడంతో పాదచారులు రోడ్లపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ముగ్గురు సీనియర్ సిటిజన్లు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. ఫుట్‌పాత్‌లు ప్రజలు నడిచేందుకు నిర్మించబడినవని, కానీ ప్రస్తుతం అవి అక్రమాల కేంద్రాలుగా మారాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
విచారణ చేపట్టిన హైకోర్టు, పాదచారులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసింది. ఫుట్‌పాత్‌లపై ఉన్న అక్రమ నిర్మాణాలు, అనధికార వ్యాపారాలు, అలాగే వాహనాల పార్కింగ్‌ను తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఫుట్‌పాత్ అనేది వాహనాల కోసం కాదు, ప్రజలు సురక్షితంగా నడిచేందుకు ఉపయోగించే ప్రదేశమని కోర్టు అభిప్రాయపడింది. ఫుట్‌పాత్‌లు ఆక్రమించబడటం వల్ల ప్రజలు రోడ్లపైకి రావాల్సి వస్తోందని, దీని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది.
అయితే చిన్న వ్యాపారుల జీవనోపాధి కూడా ముఖ్యమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కల్పిస్తూ ట్రాఫిక్‌కు, పాదచారులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచనలు వినిపిస్తున్నాయి.
ఇకపై ఫుట్‌పాత్‌లపై అక్రమంగా వ్యాపారాలు నిర్వహించినా, వాహనాలు పార్క్ చేసినా జీహెచ్‌ఎంసీ అధికారులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

