రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ..? నిరుద్యోగుల ఆగ్రహం.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు

తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళనలు మళ్లీ ఉధృతమయ్యాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువత మరోసారి ధర్నాకు దిగింది. గత కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ధర్నాలో పాల్గొన్న నిరుద్యోగులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకు కేవలం కొన్ని పోస్టులకే నోటిఫికేషన్లు వచ్చాయని ఆరోపించారు.

పక్క రాష్ట్రాల్లో వరుసగా గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయని, కానీ తెలంగాణలో మాత్రం నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రకటనలే తప్ప ఉద్యోగాలు కనిపించడం లేదని అన్నారు. జూన్ 2లోపు ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

వయో పరిమితి పెంపు అంశాన్ని కూడా నిరుద్యోగులు ప్రస్తావించారు. కేవలం ఏజ్ రిలాక్సేషన్ ప్రకటించడం సరిపోదని, వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వకపోతే వేలాది మంది వయోపరిమితి దాటిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నిరుద్యోగులు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. “మెగా డీఎస్సీ, భారీ గ్రూప్-1, పోలీస్ ఉద్యోగాలు” అంటూ హామీలు ఇచ్చి ఇప్పుడు నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ధర్నాలో పాల్గొన్న మరో యువకుడు మాట్లాడుతూ, తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు వేల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. వెంటనే జీఓలను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే నిరుద్యోగ సమస్యలతో పలువురు యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అయినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

జూన్ 2లోపు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని, అవసరమైతే సచివాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడకూడదని వారు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *