దేశంలో ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. “సాచెట్” అనే అత్యవసర హెచ్చరిక వ్యవస్థను దేశవ్యాప్తంగా పరీక్షించేందుకు సిద్ధమైంది. ఈ పరీక్షలో భాగంగా లక్షలాది మొబైల్ ఫోన్లకు ఒకేసారి భారీ శబ్దంతో కూడిన ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ రానుంది.
వరదలు, తుఫాన్లు, భూకంపాలు లేదా ఇతర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను వెంటనే అప్రమత్తం చేయడం, ప్రమాద ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు హెచ్చరికలు పంపడం ఈ టెక్నాలజీ ప్రధాన లక్ష్యంగా కేంద్రం చెబుతోంది.
ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నా కూడా ఈ సైరన్ శబ్దం వినిపించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఇది కేవలం ట్రయల్ రన్ మాత్రమేనని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని టెలికమ్యూనికేషన్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థలు వెల్లడించాయి.
అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సూచనల మేరకు రూపొందించిన ఈ సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ వ్యవస్థ ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమల్లోకి తీసుకొచ్చారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించబడుతోంది.
తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన, ఎమర్జెన్సీ సివిల్ డిఫెన్స్ శాఖ కూడా దీనిపై ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. అత్యవసర పరిస్థితుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంత వేగంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికే ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందవద్దని తెలిపింది.
ఇప్పటికే దేశంలో వరదలు, భారీ వర్షాలు, తుఫాన్లు, భూకంపాల సమయంలో సమాచారం ఆలస్యంగా అందడం వల్ల నష్టాలు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు క్షణాల్లో సమాచారం చేరేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.
కాబట్టి ఈరోజు మీ మొబైల్‌కు భారీ సైరన్ శబ్దంతో కూడిన అలర్ట్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం అత్యవసర హెచ్చరిక వ్యవస్థ పనితీరును పరీక్షించే ట్రయల్ మాత్రమే. ప్రజలు అప్రమత్తంగా ఉండడమే కాకుండా, తమ కుటుంబ సభ్యులు మరియు పరిసరాల వారికీ కూడా ఇది ట్రయల్ మాత్రమేనని తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు.

