పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో వేల సంఖ్యలో ఫేక్ వీడియోలు వైరల్ అవుతుండటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈజీ మనీ పేరుతో అమాయకులను మోసం చేయడమే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ప్రముఖుల ఫేక్ వీడియోలు, వాయిస్‌లను సృష్టిస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నట్లుగా ఫేక్ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోల్లో “రూ.22,000 పెట్టుబడి పెడితే ప్రతి నెల రూ.22 లక్షలు వస్తాయి” అంటూ ఒక ప్రభుత్వ మొబైల్ యాప్ ఉందని ప్రచారం చేస్తున్నారు.
వీడియోలో బుధవారం, జనవరి 28, 2026 తేదీని ప్రస్తావిస్తూ పార్లమెంట్‌లోనే వాగ్వాదం జరిగినట్టుగా దృశ్యాలను ఎడిట్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆర్థిక మంత్రిని ప్రశ్నిస్తున్నట్టుగా, దీనికి నిర్మల సీతారామన్ స్పందిస్తూ “ఇది కేంద్ర ప్రభుత్వ అధికారిక యాప్, ఎలాంటి రహస్యం లేదు, యాప్ టెస్టింగ్ పూర్తయింది” అంటూ చెప్పినట్టుగా చూపించారు. ప్రజలు యాప్ డౌన్లోడ్ చేసి రూ.22,000 డిపాజిట్ చేస్తే ప్రతి నెల రూ.22 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని వీడియోలో చూపించారు.
ఇది పూర్తిగా ఫేక్ అని సైబర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గతంలోనూ ఇదే తరహాలో ఇన్ఫోసిస్ సుధామూర్తి సహా పలువురు ప్రముఖుల పేర్లతో ఇన్వెస్ట్మెంట్ మోసాలకు పాల్పడ్డ ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భాన్ని ఆసరాగా చేసుకుని ఈ వీడియోలను మరింత నమ్మకంగా రూపొందించడం ఆందోళన కలిగిస్తోంది.
స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిపోవడం, త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో చాలామంది వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫాంలలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపించడం మోసగాళ్లకు వరంగా మారింది. “22 వేల పెట్టుబడితో 22 లక్షల ఆదాయం” వంటి వాగ్దానాలు వినిపిస్తేనే అది మోసమని గుర్తించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
నిజానికి, ప్రభుత్వం బ్యాంక్ డిపాజిట్లపై కూడా కనీస వడ్డీ ఇవ్వడానికి కష్టపడుతున్న పరిస్థితిలో, ఎవరు నెలకు రూ.22 లక్షలు ఇస్తారు అనే సాధారణ ఆలోచన ప్రజలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లాభాలు నిజమైతే, ఆ యాప్ నిర్వహించే వ్యక్తి అంబానీలకన్నా పెద్ద కోటీశ్వరుడై ఉండాల్సిందేనని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.
అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన ఏ యాప్ అయినా సరే:
- అది నిజంగా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ కాదా అనేది తప్పనిసరిగా క్రాస్ చెక్ చేయాలి
- కేవలం వీడియోలు, వాట్సాప్ ఫార్వార్డుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దు
- సంబంధిత ప్రభుత్వ శాఖలు లేదా అధికారిక వెబ్సైట్లలో సమాచారం ఉందా లేదా చూడాలి
టెక్నాలజీ అభివృద్ధితో ఏది రియల్, ఏది ఫేక్ అన్నది గుర్తించడం కష్టంగా మారుతున్న ఈ రోజుల్లో, ప్రజలే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. “ఈజీ మనీ” పేరుతో వచ్చే వీడియోలు ఎంత ఆకర్షణీయంగా కనిపించినా, ఒక్క తప్పు నిర్ణయం జీవితాంతం సంపాదించిన డబ్బును పోగొట్టే పరిస్థితి తీసుకురావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

