గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన తోపులాట రాజకీయంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ ఈ ఘటనపై స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం చిన్న మిస్ అండర్‌స్టాండింగ్ మాత్రమేనని, పార్టీ లోపల ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.
“పాతపేట ఎమ్మెల్యే గారు నన్ను స్టేజ్ మీదకు రమ్మన్నారు. నేను రాను అన్నాను. నేను ఆయనను నెట్టాను, ఆయన కూడా నన్ను నెట్టారు. వెనకాల కుర్చీ ఉండటంతో నేను పడిపోయాను. తర్వాత ఆయనకు విషయం అర్థమైంది. వచ్చి నన్ను హత్తుకుని ముద్దు పెట్టుకున్నారు. ఇది మా పార్టీ ఫ్యామిలీలో జరిగే చిన్న విషయం మాత్రమే” అని ఫిరోజ్ ఖాన్ తెలిపారు.
మంత్రుల పక్కన కూర్చోవడానికి అందరూ ప్రయత్నించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పారు. “స్టేజ్ మీద వీఐపీ కుర్చీలు ఉంటాయి కదా. నేను ముందుగా వెళ్లి కూర్చోవాలని చూసాను. ఉస్మాన్ అలీ గారు నన్ను స్టేజ్ మీదకు రమ్మన్నారు. నేను రాను అన్నాను. ఆ క్రమంలో ఇద్దరం ఒకరినొకరం నెట్టుకున్నాం. తర్వాత వెంటనే సర్దుకుపోయాం” అని వివరించారు.
సమావేశం మధ్యలోనే ఆగిపోయిందా అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, “కాదండి, సమావేశం పూర్తిగా జరిగింది. అసలు సబ్జెక్ట్‌పై డీటెయిల్ డిస్కషన్ కూడా జరిగింది. ఒక చిన్న ఇష్యూని unnecessarily పెద్దది చేస్తున్నారు” అని అన్నారు.
ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణపై జరిగిన ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అయితే సీటింగ్ వ్యవహారం చిన్న గొడవకు దారితీయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఇద్దరు నేతలు కలిసి మాట్లాడుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
“జై హింద్.. జై కాంగ్రెస్” అంటూ ఫిరోజ్ ఖాన్ తన వ్యాఖ్యలను ముగించారు.

