గచ్చిబౌలి ఎన్‌జీఓస్ ల్యాండ్ వివాదం: “4500 ఉద్యోగుల హక్కుల కోసం చివరి వరకు పోరాటం”

గచ్చిబౌలి భాగ్యనగర్ ఎన్‌జీఓస్ అసోసియేషన్ భూముల వివాదం మరోసారి రాజకీయ మరియు పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత 277 రోజులుగా రిటైర్డ్ ఉద్యోగులు, టీఎన్జీఓస్ సభ్యులు మరియు ప్లాట్ యజమానులు నిరసనలు కొనసాగిస్తూ తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఉద్యమం ఇప్పుడు మరింత ఉధృతమైంది.

ఉద్యోగుల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం మారిన తర్వాత రాత్రివేళల్లో కొంతమంది వచ్చి వాచ్‌మెన్‌పై దాడి చేసి ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. ఈ విషయాలు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లాయా లేదా అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. “మేము డబ్బులు తీసుకోము.. మా భూమి మాకే కావాలి. ఇందులోనే కాలనీ నిర్మించుకోవాలని ఆశిస్తున్నాం” అని వారు స్పష్టం చేశారు.

ఈ భూముల సమస్య కోర్టులో ఉన్నప్పటికీ కొందరు కావాలనే ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మొత్తం 4500 మంది ప్లాట్ యజమానుల కుటుంబాలు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయని, ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉద్యమాన్ని విస్తరిస్తామని హెచ్చరించారు.

ఇటీవల తమపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిగినట్లు నాయకత్వం వెల్లడించింది. కొంతమంది చేసిన సంతకాలు నకిలీవని, మరికొన్ని చనిపోయిన వ్యక్తుల పేర్లతో ఉన్నాయని అధికారులు గుర్తించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు సిద్ధంగా ఉన్నామని కూడా పేర్కొన్నారు.

ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణలను ఖండించిన సంఘ నాయకులు, “మేము చట్టబద్ధంగా డబ్బులు చెల్లించాం. ఉద్యోగుల కోసం కేటాయించిన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని ఒప్పుకోము” అని స్పష్టం చేశారు. కొత్త సభ్యులను చేర్చుకుని భారీ మొత్తాలకు ప్లాట్లు అమ్ముతున్నారనే ఆరోపణలను కూడా వారు తిరస్కరించారు.

ఎండల తీవ్రత కారణంగా దీక్షను పూర్తిగా నిలిపివేయకుండా పరిమిత సంఖ్యలో కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రోజుకు 50 నుంచి 60 మంది వరకు పాల్గొంటూ నిరసన కొనసాగుతోందన్నారు.

ఇటీవల మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశమైనట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. తమ సమస్యపై మంత్రి సానుకూలంగా స్పందించారని, ముఖ్యమంత్రి వద్ద కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

ఈ భూమిని గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు కేటాయించిందని గుర్తుచేసిన నాయకులు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తమకు నమ్మకం ఉందన్నారు. కోర్టులో ఉన్న 17న్నర ఎకరాల సమస్యను పరిష్కరించి, ప్రభుత్వ మెమోను ఉపసంహరించుకుంటే గచ్చిబౌలిలో పండుగ వాతావరణం నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *