గ్రామ పాఠశాల అభివృద్ధికి పెద్దపీట.. స్ట్రెంత్ పెంచితే నిధులు, సదుపాయాలు

గ్రామ పాఠశాల అభివృద్ధికి ప్రజాప్రతినిధుల సమిష్టి ప్రయత్నం

విద్యాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న గ్రామ కమిటీ

గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాఠశాల భవనాల అభివృద్ధికి సంబంధించిన అంచనాలను ఇప్పటికే గ్రామ కాంట్రాక్టర్ ద్వారా సిద్ధం చేయించగా, దానికి సుమారు రూ.10 నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. ఇది గౌరవనీయులైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి నియోజకవర్గానికి చెందిన గ్రామం కావడంతో, ఆయనతో చర్చించి అవసరమైన నిధులు తీసుకురావాలని గ్రామ నాయకులు భావిస్తున్నారు.

పాఠశాలలో గదుల ప్లాస్టింగ్, రూంల మరమ్మతులు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే, స్కూల్ అభివృద్ధితో పాటు విద్యార్థుల సంఖ్య (స్ట్రెంత్) పెంచడం అత్యంత కీలకమని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు. గ్రామంలోని ప్రతి వార్డు సభ్యుడు కనీసం కొంతమంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు బాధ్యత తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, టెట్, డీఎస్సీ వంటి కఠిన పరీక్షలు ఉత్తీర్ణులైన అర్హత కలిగిన ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు భారీ ఫీజులు చెల్లించి పిల్లలను పంపాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ విద్య లభిస్తుందని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.

వచ్చే విద్యాసంవత్సరంలో కనీసం 30 నుంచి 35 మంది విద్యార్థులను చేర్పించి స్కూల్ స్ట్రెంత్ పెంచితే, మరిన్ని పోస్టులు, అదనపు సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం సహా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లక్ష్మారెడ్డి గారికి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు, గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే రోడ్ల అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కూడా త్వరలో చేపట్టనున్నట్లు వెల్లడించారు.

వికారాబాద్–మోతుపల్లి మధ్య రూ.32 కోట్లతో డబుల్ రోడ్ మంజూరు కావడం గ్రామ భవిష్యత్తుకు కీలకంగా మారనుందని, దీని ద్వారా గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరమని కోరుతూ సమావేశం ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *