తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసిన కవిత వ్యాఖ్యలు

K. Kavitha తన కొత్త రాజకీయ ప్రస్థానం, తెలంగాణ భవిష్యత్‌పై తన విజన్‌, సామాజిక న్యాయం, ఉచిత విద్య–వైద్యం వంటి అంశాలపై విస్తృతంగా మాట్లాడారు. రాజకీయాల్లో వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, తాను నేర్చుకున్న రాజకీయ పాఠాలు అన్నీ గొప్ప నాయకత్వం నుంచే వచ్చాయని ఆమె పేర్కొన్నారు.

కవిత మాట్లాడుతూ, గతంలో పార్టీ వ్యవస్థలో ఉన్నప్పుడు తాను భిన్నాభిప్రాయాలు ఇంటర్నల్‌గా చెప్పేదాన్నని, ఇప్పుడు పరిస్థితులు మారడంతో అదే విషయాలను బహిరంగంగా చెప్పాల్సి వస్తోందన్నారు. “నా అభిప్రాయాలు మారలేదు, పరిస్థితులే మారాయి” అని ఆమె స్పష్టం చేశారు.

ఆడపిల్లల కోసం నేను ఫెయిల్ అవ్వకూడదు”

రాజకీయాల్లో మహిళలకు అదనపు ఒత్తిడి ఉంటుందని కవిత వ్యాఖ్యానించారు. ఒక మహిళ రాజకీయంగా విఫలమైతే “ఆడవాళ్లకు అవకాశం ఇచ్చినా ప్రయోజనం లేదని” సమాజం భావించే ప్రమాదం ఉందన్నారు. అందుకే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ విఫలమవ్వకూడదనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నానని తెలిపారు.

తెలంగాణ రక్షణ సేన వెనుక ఉద్దేశం ఇదే

తాను ప్రారంభించిన “తెలంగాణ రక్షణ సేన” పార్టీ గురించి వివరిస్తూ, ఇది కేవలం రాజకీయ గుర్తింపు కోసం లేదా ప్రచారం కోసం కాదని చెప్పారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో పార్టీని స్థాపించానన్నారు.

ప్రస్తుతం దేశంలో 90 శాతం మంది ప్రజల నెలవారీ ఆదాయం ₹30 వేల లోపే ఉందని, అందులోనూ వారి సంపాదనలో 70 శాతం విద్యా, వైద్య ఖర్చులకే వెళ్తోందని కవిత పేర్కొన్నారు. ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడం లేదని విమర్శించారు.

ఉచిత విద్య – ఉచిత వైద్యం ప్రధాన అజెండా

ప్రభుత్వం ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగం అనే తేడా లేకుండా ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతోనే పార్టీని ప్రారంభించామని తెలిపారు. ఇదే తమ రాజకీయ సిద్ధాంతానికి కేంద్రబిందువని పేర్కొన్నారు.

రైతులు, యువత, ఉపాధిపై ప్రత్యేక దృష్టి

రైతుల సమస్యలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని కవిత అన్నారు. గత ప్రభుత్వం “ధరణి”, ప్రస్తుత ప్రభుత్వం “భూమాత” పేర్లు మార్చినా రైతుల భూ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని విమర్శించారు.

ఉపాధి విషయంలో కూడా ప్రభుత్వాలు కేవలం హామీలు ఇస్తున్నాయే తప్ప యువతను ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లే విధానాలు అమలు చేయడం లేదన్నారు. యువతలో పెట్టుబడి పెట్టి తెలంగాణ నుంచే ప్రపంచస్థాయి కంపెనీలు రావాలని తమ లక్ష్యమని చెప్పారు.

సోషల్ జస్టిస్‌పై కఠిన హామీ

సోషల్ జస్టిస్ కేవలం నినాదంగా కాకుండా కార్యాచరణగా ఉండాలని కవిత పేర్కొన్నారు. వికలాంగులు, ట్రాన్స్‌జెండర్లు, మాజీ సైనికులు, లొంగిపోయిన మావోయిస్టులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సముచిత అవకాశాలు కల్పించే విధంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.

“మా పార్టీ సోషల్ జస్టిస్‌తో కేవలం రిలేషన్‌లో కాదు… మ్యారేజ్‌లో ఉంటుంది. డైవోర్స్ ఆప్షన్ ఉండదు” అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

Gen-Z రాజకీయాలపై స్పందన

ప్రస్తుతం యువత సంప్రదాయ రాజకీయ హామీలను సులభంగా నమ్మే పరిస్థితి లేదని అంగీకరించిన కవిత, కానీ రాజకీయాల కోర్ విలువ మాత్రం ఎప్పటికీ మారదన్నారు. “తెలంగాణ ఫస్ట్” అనే సిద్ధాంతమే తమ పార్టీ మూల సూత్రమని చెప్పారు.

తెలంగాణ ఉద్యమం గురించి కొత్త తరం ఎంతవరకు తెలుసో తెలియదని వ్యాఖ్యానిస్తూ, “జెన్-Z అయినా, ఎవరైనా… భూమితో కనెక్షన్ కోల్పోతే సర్వైవ్ కాలేరు” అన్నారు.

చివరగా, ప్రపంచాన్ని కాలుష్యంతో నింపిన తరం తమదేనని, కొత్త తరానికి మెరుగైన భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని కవిత వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *