తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తుండగా, మరోవైపు జనసేన నేతలు తమ అధినేత వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రజల మధ్య విభేదాలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పాటును జనసేన ఎప్పుడూ వ్యతిరేకించలేదు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతోనే మేము పోరాడుతున్నాం. పార్టీ కంటే దేశ సమగ్రతే మాకు ముఖ్యమని” పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది. ఇదే సమయంలో కొన్ని రాజకీయ పార్టీలపై విమర్శలు చేస్తూ, “కాక్రోచ్ పార్టీని చూస్తే చలచీమల పద్యం గుర్తుకు వస్తుంది. చిన్న జీవులుగా కనిపించినా బలమైన పామును కూడా చంపగలవు” అంటూ వ్యాఖ్యానించినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, రాజకీయాల్లో సినిమా డైలాగులు పనికిరావని, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్‌కు లేదని విమర్శించారు. తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
మరోవైపు రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ వివాదం ప్రజల్లో కంటే రాజకీయ నాయకుల మధ్యనే ఎక్కువగా కొనసాగుతోందని అభిప్రాయపడుతున్నారు. ఒకసారి ప్రెస్‌మీట్, దానికి కౌంటర్, తిరిగి రాజకీయ విమర్శలు… ఇలా అంశాన్ని పదేపదే ముందుకు తీసుకువస్తూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి ప్రస్తుతం తెలంగాణలో ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు కనిపించడం లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే తేడా లేకుండా ప్రజలు కలిసి జీవిస్తున్నారు. ఉపాధి, వ్యాపారం, విద్య, ఉద్యోగాల కోసం ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లడం సాధారణమైపోయింది. హైదరాబాద్ వంటి నగరాల్లో అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి జీవిస్తున్నారు.
అయితే రాజకీయ అవసరాల కోసం గతంలో జరిగిన ఉద్యమాలను మళ్లీ ముందుకు తీసుకొచ్చి ప్రజల మనసుల్లో అనుమానాలు, విభేదాలు నాటే ప్రయత్నం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో పెద్దగా లేని అంశాలను రాజకీయ నాయకులే ప్రధాన చర్చగా మార్చుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉండగా, కాంగ్రెస్ ఇండియా కూటమిలో భాగంగా కొనసాగుతోంది. దీంతో ఒకరిపై మరొకరు రాజకీయ విమర్శలు చేసుకోవడం సహజమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఆ విమర్శలు ప్రజల మధ్య విద్వేషాలకు దారితీయకుండా ఉండాలని సూచిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో అనేక మంది యువకులు ప్రాణత్యాగాలు చేశారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. అలాంటి పరిస్థితులు మళ్లీ రాకూడదని సాధారణ ప్రజలు కోరుకుంటున్నారు. రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉండొచ్చు, విమర్శలు ఉండొచ్చు. కానీ ప్రజల ఐక్యతకు భంగం కలిగించేలా వ్యవహరించకూడదని అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ లబ్ధి కోసం ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకుండా, ప్రజల సమస్యలైన నిరుద్యోగం, రైతు సమస్యలు, ధరల పెరుగుదల, అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రస్తుతం ప్రజల్లో ప్రశాంతత ఉంది. ప్రాంతీయ భేదాలకు అతీతంగా కలిసి జీవించే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం పాత గాయాలను మళ్లీ తెరపైకి తీసుకురావడం కంటే ప్రజల భవిష్యత్తు కోసం పనిచేయడం అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

